తెలంగాణ వాళ్లకు ఎవరికీ 3 ఎకరాల కంటే ఎక్కువ భూమి లేదని రేవంత్‌రెడ్డి అంటున్నారు. 3 గంటల కరెంట్ చాలని, 10 హెచ్‌పీ మోటర్ పెట్టాలని చెప్తున్నారు. అసలు రేవంత్‌కు, రాహుల్‌గాంధీకి ఎద్దు, ఎవుసం గురించి ఏమీ తెల్వదు. వారికి కేవలం క్లబ్‌ల గురించి, పబ్బుల గురించి మాత్రమే తెలుసు.
-మంత్రి కేటీఆర్
సిద్దిపేట, నవంబర్ 21( నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ హైదరాబాద్ సిటీబ్యూరో/రాజన్న సిరిసిల్ల, (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ చీకటి రోజులే వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు ప్రజలను హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో పొరపాటు చేస్తే మళ్లీ 50 ఏండ్లు వెనక్కి పోతామని, 1956లో చేసిన తప్పుకు 58 ఏండ్లు పట్టిందని అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్‌లో యువగర్జన, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, కంటోన్మెంట్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్‌షోల్లో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాక ముందు కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎట్ల ఉండే.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలని సూచించారు. నాడు కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, అర్ధరాత్రి కరెంట్, ఎండిన చెరువులు ఉండేవని గుర్తుచేశారు.
స్వరాష్ట్రంలో నేడు కరెంట్ కష్టాలు లేవని, 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్తు సరఫరాతో రైతన్నలు సంబురంగా సాగు చేసుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడు కరెంట్ గురించి మాట్లాడుతున్నరని, తామే రెండు బస్సులు ఏర్పాటు చేస్తామని.. రాష్ట్రంలోని ఏ ఊరికి వెళ్తారో వెళ్లి.. కరెంట్ తీగలు పట్టుకుంటే తెలుస్తుందని సవాల్ విసిరారు. తెలంగాణ ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందో ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
ఉప ఎన్నిక సమయంలో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. మళ్లీ మోసం చేసేందుకు కొత్త హామీలు ఇస్తున్నారని విమర్శించారు. బీజేపీని నమ్మి ఓటేస్తే రూ.400 ఉన్న సిలిండర్ ధర రూ.1200కు పెంచారని, డిసెంబర్ 3 తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.400కే సిలిండర్ అందిస్తుందని హామీ ఇచ్చారు. వచ్చే జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని, కత్తిపోట్ల రాజకీయానికి ఓటుపోటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
‘కాంగ్రెస్‌కు ఓటేస్తే రాహుల్‌గాంధీకి.. బీజేపీకి వేస్తే నరేంద్రమోదీకి పోతుంది. కేసీఆర్‌కు తెలంగాణపై ఉన్న ప్రేమలో మీసమెత్తయిన ఢిల్లీవాళ్లకు ఉంటుందా? అలిగిన, గులిగినా మనోళ్ల మీదనే ఉండాలని, ఢిల్లీ వాళ్ల చేతిలో మళ్ల జుట్టుపెడితే బతుకులు ఆగమైపోతాయి’ అని కేటీఆర్ హెచ్చరించారు. కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీల మాటలు నమ్మద్దని కోరారు. ముస్తాబాద్ రోడ్‌షోకు హాజరైన కేటీఆర్‌ను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
నాడు కరెంటు ఇయ్యకుండా రైతులు, ప్రజలను గోసపెట్టిన కాంగ్రెస్ నేతలకు నేడు కరెంటు గురించి మాట్లాడేందుకు సిగ్గుండాలన్నారు. కాళ్లలో కట్టె పెట్టినట్టు కంటోన్మెంట్ అభివృద్ధిని కేంద్రంలోని బీజేపీ సర్కార్ అడ్డుకుంటున్నదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రహదారుల విస్తరణ, ఫ్లై ఓవర్ల నిర్మాణానికి రక్షణశాఖకు సంబంధించిన 100 ఎకరాలు ఇస్తే..దీనికి సరిసమానంగా శామీర్‌పేటలో 500 ఎకరాలు తిరిగి ప్రభుత్వ భూమిని అప్పగిస్తామని కోరినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు.

‘మీరు పెంచిన బిడ్డను నేను. మీరు ఓటేస్తే ఎమ్మెల్యే అయిన. మీ కోసం సేవ చేస్తున్న. మీ కోసం పని చేస్తున్న. బాధ్యతలు పెరిగినయి. మంత్రిగా, పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నందున ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతా తిరగాల్సి వస్తుంది’ అని కేటీఆర్ అన్నారు. ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి రావాలని, ప్రతి ఒక్కరినీ కలవాలని ఉందని, రాష్ట్రమంతా తిరుగుతున్న కాబట్టి రాలేకపోతున్నానని చెప్పారు. తొమ్మిదిన్నరేండ్లలో చేసిన పని ప్రజల ముందున్నదని, కళ్ల ముందున్న అభివృద్ధిని చూసి నమ్మండని కోరారు. ఎవరో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు, సన్నాయినొక్కులు నొక్కితే వాటికి పడిపోకండి అని విజ్ఞప్తి చేశారు. ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమంలో పాలుపంచుకునేలా మీ తమ్ముడిలా మళ్లీ ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ప్రపంచంలో ఎక్కడపోయిన నేను సిరిసిల్ల ఎమ్మెల్యేనని గర్వంగా చెప్పుకుంటున్ననని గుర్తు చేశారు. మీరు గర్వపడే విధంగా పని చేశానే తప్ప, తలవంచుకునేలా ఏ పని చెయ్యలేదని స్పష్టంచేశారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కొత్త ప్రభాకర్‌రెడ్డి, లాస్య నందిత, తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇంఛార్జి ఎమ్మెన్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు పీఎల్ శ్రీనివాస్, సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇంచార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.