Minister KTR | సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు సంచలనం. ప్రతి నిర్ణయం చరిత్రాత్మకం. సిద్దిపేట నుంచి గులాబీ జెండాకు ప్రాణం పోశారు. కరీంనగర్ గడ్డ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీకి ఎలుగెత్తి చాటారు. మహబూబ్‌నగర్ నుంచి దేశాన్ని ఒప్పించి తెలంగాణ కల సాకారం చేశారు. గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించి ఉజ్వల తెలంగాణగా మార్చారు. వందేండ్ల ప్రగతిని పదేండ్లలో చేసి చూపించారు. అట్లాంటి కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నారంటే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వారి గుండెలు ఝల్లుమంటున్నాయి.
-మంత్రి కేటీఆర్
నిజామాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీది మేకప్.. కాంగ్రెస్‌ది ప్యాకప్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీచేస్తుండటంతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. సరికొత్త చరిత్రకు కామారెడ్డి వేదిక కాబోతున్నదని, దక్షిణ భారతదేశంలోనే హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నారని ధీమా వ్యక్తంచేశారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా కేసీఆర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత కామారెడ్డి ప్రజలందరిపై ఉన్నదని చెప్పారు. కామారెడ్డి ఆదర్శ నియోజకవర్గంగా, ఓ రోల్‌మాడల్‌గా నిలువడం ఖాయమని పేర్కొన్నారు. కామారెడ్డి పర్యటనలో భాగంగా డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. అంతకుముందు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్‌తో కలిసి 8 కోట్లతో నిర్మించనున్న మినీ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి గంటకుపైగా ప్రసంగించిన కేటీఆర్.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయాన్ని సాధించబోతున్నదని ధీమా వ్యక్తంచేశారు. అతి విశ్వాసానికి పోకుండా కార్యకర్తలంతా మరింత కష్టపడాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు గల్లంతు కావాలని అన్నారు. కామారెడ్డి ప్రాంతంతో కేసీఆర్‌కు ఉన్న అనుబంధాన్ని వివరించారు. 2004లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన షబ్బీర్‌అలీ గెలుపునకు మిత్ర ధర్మంలో భాగంగా ప్రచారం చేసేందుకు కేసీఆర్‌ను బతిమిలాడారని గుర్తుచేశారు. 2001 నుంచి గులాబీ కంచుకోటగా ఉన్న కామారెడ్డిని పొత్తు ధర్మంలో భాగంగా కేసీఆర్ వదులుకొన్నారని, అలాంటి షబ్బీర్‌అలీ ఇప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కామారెడ్డి రికార్డు సృష్టించాలి
119 నియోజకవర్గాల్లో, దేశంలోనే రికార్డు సృష్టించేందుకు కామారెడ్డి ముందుకు రావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతీ గ్రామంలో మ్యానిఫెస్టో తయారు చేయాలని, ఏంకావాలో తనను అడగాలని, ఆ బాధ్యత తాను తీసుకుంటానని మాటిచ్చా రు. ‘గంభీరావుపేటలో ప్రోగ్రామ్ చేసుకుని వస్తుంటే మాచారెడ్డిలో ఆగిన. ఛాయ్ తాగుతుంటే పిల్లల్ని అడిగిన. సీఎం వస్తుండు కదా.. ఏమనుకుంటున్నారని అడిగినా. మాకు సీఎం వస్తుండు కదా.. మాకేం రం ది లేదన్నరు. ఇలాంటి చర్చ అంతటా జరుగుతున్నది. రాష్ట్రంలోనే కామారెడ్డి అగ్రశ్రేణి నియోజకవర్గం అవుతుంది’ అని పేర్కొన్నారు. ఈసారి ఇంట గెలువడంతోపాటు బయటకూడా గెలువాల్సి ఉన్నద ని చెప్పారు. మహారాష్ట్రలో ఒక్క ఓటుతో నాలుగైదు ప్రభుత్వాలు మారాయని, దమ్మున్న నాయకుడి కోసం మహారాష్ట్ర ఎదురు చూస్తున్నదని తెలిపారు.
ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవ్వాలి!
‘పెద్దా చిన్నా చూడకండి. ఒక్కో బూత్‌లో లెక్కబెట్టి కొట్టాలి. 266 బూత్‌లుంటే 266 మంది బ్రిగేడియర్లను ఇయ్యండి. నేనే ఫాలోఅప్ చేస్తా. రోజూ ఫోన్ చేస్తా. కొడితే ప్రతిపక్షాల దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా కొట్టాలి. ఎప్పుడొచ్చామన్నది కాదు. బుల్లెట్ దిగిందా.. అన్నట్టు మెజార్టీ రికార్డు కొట్టాలి’ అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అధినాయకుడే వస్తున్నందున అంతా కలిసి కలిసి పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా కూడా చాలా ముఖ్యమైనదని, గ్రామంలో కో-ఆర్డినేటర్లను నియమించాలని ఆదేశించారు. గంప గోవర్ధన్ ఇప్పటికే మెడికల్ కాలేజీ తెచ్చుకున్నరని, ఇప్పుడు ఇంజినీరింగ్ కళాశాలకు సూటి పెట్టారని అన్నారు. సీఎం తలుచుకుంటే అన్నీ సాధ్యమైతాయని చెప్పారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 146 ఎకరాలకు కాంపౌండ్‌వాల్, మినీ ట్యాంక్‌బండ్ పూర్తి, పబ్లిక్ గార్డెన్ అభివృద్ధి, డెయిరీ కళాశాలలో కృషి విజ్ఞాన్ కేంద్రం ఏర్పాటు, రైతు ఉత్పత్తులకు మార్కెటింగ్ వసతులు, క్రీడా ప్రాంగణాలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, పుణ్యక్షేత్రాలు అభివృద్ధి చేయాలని గంప గోవర్ధన్ కోరారని, ఇవన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని మాట ఇచ్చారు. మంత్రులుగా ఉండి కూడా చేయలేని పనులు ఎమ్మెల్యేగా గంప గోవర్ధన్ చేసి చూపించారని చెప్పారు. సీఎంను కలిసి నిన్న కాక మొన్న 35 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తెచ్చారని అన్నా రు. ‘ఇప్పుడే 8 కోట్లతో ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియానికి శంకుస్థాపన చేసుకున్నామని, అన్ని వసతులతో 20 ఎకరా ల్లో ఆటోనగర్ నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు.
రేవంత్‌తో పోటీపడటం దురదృష్టకరం
చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్.. రేవంత్‌లాంటి ఓటుకు నోటు దొంగతో తలపడాల్సి రావడం దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. ఓవైపు ఓటుకు నోటు దొంగ, మరోవైపు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా డ్రామాలాడిన కిషన్‌రెడ్డితో పో టీ అవమానకరంగా ఉన్నదని చెప్పారు. వీరిద్దరూ తెలంగాణ ఉద్యమంలో తీరని అన్యాయం చేశారని, ఇలాంటివాళ్లతో మనకు పోటీయా? అని ప్రశ్నించారు. వాళ్లకు ఒక్క ఓటు పడ్డా తలవంచుకోవాల్సిన పరిస్థితి అని వ్యాఖ్యానించారు. ఆ రోజు ఓటుకు నోటు.. నేడు సీటుకు నోటుతో రేవంత్ దిగజారిపోయాడని, ఇప్పుడు ఆయనను అందరూ రేవంత్‌రెడ్డి అని పిలువడం లేదని.. ‘రేటెంత’రెడ్డి అని పిలుస్తున్నారని చురకలంటించారు. రేవంత్‌రెడ్డి ఒరిజినల్‌గా ఆర్ఎస్ఎస్ మనిషని, కార్వాన్లో కిషన్‌రెడ్డికి పోలింగ్ ఏజెంట్‌గా పని చేసిన వ్యక్తి అని.. వారిద్దరి మధ్య చీకటి సంబంధం కొనసాగుతున్నదని తెలిపారు. గాంధీభవన్‌లో ఈ గాడ్సేను కూర్చోబెట్టింది ఆర్ఎస్ఎస్ వాళ్లేనని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీలకు బీ టీమ్ కావాల్సిన గత్యంతరం బీఆర్ఎస్కు పట్టలేదని, తాము తెలంగాణ ప్రజలకే ఏ టీం అని స్పష్టంచేశారు. కేంద్రంలో బీఆర్ఎస్ పాత్ర లేకుం డా ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఉండబోదని స్పష్టం చేశారు. మహారాష్ట్రకు కేసీఆర్ పోతుంటే కాంగ్రెస్, బీజేపీలకు మనసున పడుతలేదన్నారు.
గంప గోవర్ధన్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి
‘మనమందరం కాంగ్రెస్‌కు ఇంకొక్క చాన్స్ ఇ య్యాలట. ఏక్ మోఖా దేవో అంటున్నారు. వీళ్లకు 11 సార్లు అవకాశం ఇచ్చినం కదా. వీళ్లే కదా అధికారం వెలుగబెట్టినోళ్లు. సాగు, తాగునీరు ఇయ్యక, కరెంట్ ఇయ్యలేక ఆరు దశాబ్దాలు చావకొట్టినోళ్లకు మళ్లీ అవకాశం ఇస్తారా?’ ఆలోచించుకోవాలని కోరారు. ‘కామారెడ్డినుంచి కేసీఆరే పోటీ చేస్తే మీరేం చేస్తారని నేను గంప గోవర్ధన్‌ను అడిగా. కార్యకర్తగా పని చేస్తా అని సమాధానమిచ్చారు. అందరూ గోవర్ధన్‌ను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలి’ అని పిలుపునిచ్చా రు. అంతకుముందు 2వ వార్డు బీజేపీ కౌన్సిలర్ రవి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిరుమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ కురుక్షేత్రంలో కృష్ణార్జునల మాదిరిగా మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ దూసుకుపోతున్నారు. పదిహేను రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తూనే విపక్షాల బూటకపు హామీలను ఎండగడుతున్నారు.
గ్యారెంటీలతో మభ్యపెడుతున్న కాంగ్రెస్ అసలు రంగు బయటపెట్టి ప్రజలను చైతన్యపరుస్తున్నారు. దశాబ్దాలపాటు అధికారంలో ఉండి తెలంగాణను తొక్కేసిన తీరును ఉదాహరణలతో వివరిస్తున్నారు. పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను సైతం నెరవేర్చకుండా ఒక్క చాన్స్ ఇవ్వాలంటున్న బీజేపీ దమన నీతిపై దునుమాడుతున్నారు.
అభ్యర్థులను ఖరారు చేసేందుకే కాంగ్రెస్ పరిస్థితి ‘హస్త’వ్యస్తంగా మారితే, బీజేపీకి అభ్యర్థులే దొరక్క ఆపసోపాలు పడుతున్నది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ కారు మాత్రం టాప్‌గేర్‌లో దౌడు తీస్తున్నది. క్యాడర్లో ఆత్మసైర్థం నింపుతున్నది.
కేసీఆర్ పదేండ్ల పాలనతో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ మరింత అభివృద్ధి చెందేందుకు మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాల్సిన ఆవశ్యకతను హరీశ్, కేటీఆర్ ప్రజలకు వివరిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా వినపడుతున్నది ఇదే ఔర్ ఏక్ బార్.. కేసీఆర్ సర్కార్!
2004 నుంచీ కామారెడ్డి బీఆర్ఎస్దే
2001లో జలదృశ్యంలో పార్టీ ఆవిర్భవించిన నాడు కామారెడ్డి, ఎల్లారెడ్డిలో భావజాల వ్యాప్తి జరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫలితంగా 2001లో వచ్చిన మొదటి జిల్లా పరిషత్తు ఎన్నికల్లో ఆనాటి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో మాత్రమే నేరుగా గులాబీ జెండా ఎగిరిందని గుర్తుచేశారు. మాచారెడ్డి మండలంలో ఎంపీపీ, జడ్పీటీసీ రెండూ ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. 13 ఎంపీటీసీల ఏకగ్రీవంతో మాచారెడ్డి సత్తా చాటిందని పేర్కొన్నారు. అందుకే సీఎం కేసీఆర్ జల సాధన ఉద్యమాన్ని ప్రారంభించేందుకు ఇక్కడికి బ్రిగేడియర్‌గా వచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో గోదావరి, కృష్ణ నదుల్లో జరుగుతున్న పోరాటంలో కామారెడ్డి కీలకంగా మారిందని, పార్టీ నిధుల సేకరణకు కూలీ పనుల కోసం పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఇక్కడికే వచ్చారని తెలిపారు. ఈ నియోజకవర్గంతో ఉన్న అనుబంధాన్ని, ప్రేమను పంచుకున్నారు.
‘ముదిరాజ్‌లకు 2 ఎకరాల స్థలం, 2 కోట్లు ఇయ్యాలన్నారు. ఈ రోజే ఉత్తర్వులిస్తాం. ముదిరాజ్‌లకు మాటిస్తా ఉన్నా. ప్రాతినిధ్యం విషయంలో గ్యాప్ ఉంటే సవరించుకుంటాం. బండ్ల ప్రకాశ్ డిప్యూటీ చైర్మన్‌గా శాసనమండలిలో ఉన్నారు. రానున్న కాలంలో సగౌరవంగా కడుపులో పెట్టుకుని, గుండె ల్లో పెట్టుకుని చూసుకుంటాం.
నాలుగు కోట్ల జనాల నుదిటిపై నిత్య తిలకం కేసీఆర్. భూమి పుత్రుడు కేసీఆర్. కామారెడ్డి నుంచి పోటీ చేయాలని గంప గోవర్ధన్ కోరడం, కేసీఆర్ అంగీకరించడం వెనుక బలమైన కారణం ఉంది. నెర్రెలు బారిన నేల.. నెత్తురు పారిన నేలను పచ్చబడేలా చేయాలని, నీళ్లు పారియ్యాలనే ఆలోచన ఉన్నది.
మనం తెలంగాణ బిడ్డలం. రేషం, పౌరుషంగల్ల బిడ్డలం. ఏ నిర్ణయమైనా తెలంగాణ గల్లీలో జరగాల్సిందే. కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో నిర్ణయాలు ఢిల్లీలో జరుగుతాయి. బీఫాం ఢిల్లీలో, స్కీంలకు అనుమతి ఢిల్లీలో, బాత్రూం పోవాలన్నా ఢిల్లీలోనే అనుమతి తీసుకోవాలి. ఢిల్లీలో మోకరిల్లే సన్నాసులు, మాట్లాడితే ఢిల్లీకి పోవాల్సిన దౌర్భాగ్యులు మనకు అవసరమా
-మంత్రి కేటీఆర్
కేసీఆర్‌కు అఖండ మెజార్టీ ఇవ్వాలి
పౌరుషానికి ప్రతీకగా ఉన్న నేలకు కేసీఆర్ వస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ఈ అవకాశం దక్కడం కామారెడ్డి నియోజకవర్గ ప్రజల అదృష్టం. కుల, మతాలకు అతీతంగా కేసీఆర్‌కు అఖండ మెజార్టీ కట్టబెట్టాలి. కామారెడ్డి నుంచి పోటీ అని కేసీఆర్ ప్రకటించిన మరుక్షణమే గెలుపు ఖాయమైంది. తేలాల్సింది మెజార్టీ మాత్రమే. సీఎం కేసీఆర్ పోటీచేస్తుండటంతో దేశం మొత్తం కామారెడ్డివైపే చూస్తున్నది. గంప గోవర్ధన్‌కు రెండు విషయాలు విజ్ఞప్తి చేస్తున్నాను. కామారెడ్డిలో 2 లక్షల 48 వేల ఓట్లు, 266 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. ప్రజలు మనవైపే ఉన్నారు. మంచి మెజార్టీతో కేసీఆర్‌ను శాసనసభకు పంపాలి.
-మంత్రి కేటీఆర్
కామారెడ్డితో ఏండ్లనాటి బంధం
‘కామారెడ్డితో ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. కోనాపూర్ వచ్చినప్పుడు కూడా చెప్పిన. కేసీఆర్ తల్లిగారి ఊరు.. మా నాయినమ్మ సొంత ఊరు పోసానిపల్లి. ప్రస్తుతం బీబీపేట మండలం లో ఉంది. ఆనాడు పోసాన్పల్లి అందురు. అప్పర్ మానేరు కట్టిన టైంలో భూములు మునిగిపోతే అక్కడ్నుంచి సిద్దిపేటలోని చింతమడకలో స్థిరపడ్డారు’ అని మంత్రి కేటీఆర్ కామారెడ్డితో తమ కుటుంబానికి ఉన్న ఏండ్లనాటి అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నిజానికి ఆ రోజు గ్రామానికి వచ్చినప్పుడు రాజకీయ పరమైన ఆలోచన లేదని, గంప గోవర్ధన్ వచ్చి కేసీఆర్‌ను పోటీ చేయాలని అడుగుతారని అనుకోలేదని అన్నారు. గంప గోవర్ధన్ ముందుకు వచ్చి స్వయంగా కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారని చెప్పారు. పదవుల కోసం వెంపర్లాడే నాయకులు చాలా మందిని చూశాం కానీ.. తన ప్రాంతం కోసం, ప్రజల మేలు కోసం కేసీఆర్‌ను ఇక్కడకు పిలిపించుకోవడం గొప్ప విషయం అని ప్రశంసించారు. సీఎంను ఆహ్వానించినందుకు గంప గోవర్ధన్‌ను అభినందిస్తున్నా అని చెప్పారు.