కొండమల్లేపల్లి, జూలై 8: తల్లిదండ్రు ల మరణంతో అనాథలైన ముగ్గురు చి న్నారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఉచితంగా విద్యను అందించడంతోపాటు.. 18 ఏండ్లు నిండే వరకు ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ ద్వారా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన సయ్యద్ రెహమాన్ అలీ ఈ నెల 5న తాగిన మైకంలో రోకలిబండతో భార్య సమీనాను చంపాడు. ఆ మర్నాడే తానూ ఉరేసుకుని చనిపోయాడు. వారి పిల్లలు హఫీషా, హుస్సేన్, రేయాన్ అనాథలయ్యారు. ఈ విషయం పత్రికల్లో రావడంతో మునుగోడుకు చెందిన వ్యక్తి ట్విట్టర్లో మంత్రి కేటీఆర్కు ట్యాగ్ చేశారు. చలించిన మంత్రి పిల్లల బాధ్యత తీసుకుంటామని హామీ ఇవ్వడంతోపాటు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు శనివారం కొండమల్లేపల్లి వేంకటేశ్వరనగర్లో అమ్మమ్మ, తాత య్య వద్ద ఉంటున్న చిన్నారుల దగ్గరికి వెళ్లారు. ముగ్గురినీ గురుకుల పాఠశాలలో చేర్పిస్తామని తెలిపారు. హఫీషాకు నల్లగొండలోని మైనార్టీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో అడ్మిషన్ ఇప్పించడంతోపాటు డిగ్రీ వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. హుస్సేన్, రేయాన్ పేరుమీద జాయింట్ బ్యాంక్ అకౌంట్ తీసి 18 ఏండ్లు నిండే వరకు నెలకు రూ.4 వేల చొప్పున జమ చేస్తామని డీసీపీవో గణేశ్ తెలిపారు. అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో పలువురు కృతజ్ఞతలు తెలిపారు.