హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం బీఆర్ఎస్ పార్టీకి గర్వకారణమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రపురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘కొన్ని సందర్భాల్లో మనం దేశ ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా నిలబడతాం’ అని మహిళా బిల్లు నిరూపించిందని మంగళవారం ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. పార్లమెంట్‌కు మహిళా బిల్లును తీసుకురావటంలో భాగస్వాములైన ప్రతిఒక్కరినీ ఆయన అభినందించారు. మహిళా బిల్లు పార్లమెంట్‌కు రావటం పట్ల భారతీయుడిగా తాను గర్వపడుతున్నానని తెలిపారు. ఈ మైలురాయిని చేరిన మహిళాలోకాన్ని ఆయన అభినందించారు.
బీఆర్ఎస్ పార్టీగా మొదటి నుంచి తాము మహిళా బిల్లు కోసం పోరాటం చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మహిళా బిల్లు కోసం తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని, ఇటీవల సీఎం కేసీఆర్ మహిళా బిల్లుకోసం ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. జిల్లా ప్రజాపరిషత్‌లు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు సహా అన్ని స్థాయిల స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నదని ఆయన గుర్తుచేశారు.