Minister KTR | నల్లగొండ/సూర్యాపేట/సైదాబాద్/చాదర్‌ఘాట్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ మాటలు నమ్ముదామా? ఆయన అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌నుద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలవి శిఖండి రాజకీయాలైతే.. బీఆర్ఎస్వి సీదా రాజకీయాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలు చెప్పుకొనేందుకు కోకొల్లలు ఉన్నాయని తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఐటీ హబ్‌ను మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు 18 మందికి దళిత బంధు చెక్కులు అందజేశారు. నల్లగొండ జిల్లాకేంద్రంలో ఐటీ హబ్‌తోపాటు రూ.912 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఎన్జీ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన ప్రగతి నివేదన సభలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో రూ.700 కోట్లతో నిర్మిస్తున్న హైటెక్ న్యూక్లియస్ ఐటీ టవర్‌కు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అహ్మద్ బలాలతో కలిసి శంకుస్థాపన, భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పక్కనే ఉన్న కర్ణాటకలో చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మాత్రం గ్యారెంటీ పేరిట ఎన్నికల హామీలు ఇస్తుండడం సిగ్గుచేటని మండిపడ్డారు. ‘కొందరు మాది కుటుంబ పాలన అని అంటున్నారు.. బరాబర్ మాది కుటుంబ పాలనే.. నాలుగు కోట్ల వసుధైక కుటుంబంలో అన్ని కుటుంబాలకు పెద్దగా వ్యవహరిస్తూ అందరి బాధ్యతలను నెరవేర్చుతున్న పార్టీ బీఆర్ఎస్ అని బల్లగుద్ది చెప్తున్నా’ అని కేటీఆర్ పేర్కొన్నారు. 24 గంటల కరెంట్ రావడం లేదని అంటున్న కాంగ్రెస్ నాయకుల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తామని, ఎక్కడ కరెంటు రాలేదో అక్కడికి వచ్చి తీగలు పట్టుకొంటే కరెంటు ఉన్నదా? లేదా? తెలుస్తది.. లేదా కాంగ్రెస్ దరిద్రమైనా పోతదని చురకలంటించారు.
రాజకీయాల్లో డైరెక్ట్ యుద్ధమే
రాజకీయాల్లో డైరెక్ట్ యుద్ధమే చేయాలని, ప్రజలకోసం ఏం చేశారో చెప్పే దమ్ము, ధైర్యం ఉండాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. డైరెక్ట్‌గా కొట్లాడే దమ్ము ప్రత్యర్థి పార్టీలకు లేదని ఎద్దేవా చేశారు. సూర్యాపేటకు పదేండ్లుగా ఏం చేశామో చెప్పి ఓటు అడిగే సత్తా జగదీశ్‌రెడ్డి ఉన్నదని చెప్పారు. సూర్యాపేటను జిల్లాగా చేయడంతోపాటు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని, రూ.25 కోట్లతో వందల మందికి ఉపాధి కల్పించే ఆటోనగర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కడుపు నిండా సంక్షేమం.. కంటి నిండా అభివృద్ధి ఉంటే ప్రజలు ఎందుకు ఓటెయ్యరని ప్రశ్నించారు. ఈసారి జగదీశ్‌రెడ్డికి డిపాజిట్ రాదని నల్లగొండలో కోమటిరెడ్డి మాట్టాడుతున్నారని, ఆయనకు దమ్ముంటే సూర్యాపేటకు వచ్చి జగదీశ్‌రెడ్డిపై పోటీచేయాలని సవాల్ విసిరారు. జగదీశ్‌రెడ్డి ఈసారి 50 వేల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ చచ్చిన పీనుగు!
150 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, అది చచ్చిన పీనుగుతో సమానమని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆరిపోయే దీపంలాంటి ఆ దిక్కుమాలిన పార్టీ ఎటుపడితే అటు మాట్లాడుతున్నదని మండిపడ్డారు. ‘50 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 11 సార్లు అధికారం ఇచ్చి వాళ్లతో తన్నించుకున్నది సరిపోలేదా? మళ్లీ ఇంకో చాన్స్ ఇవ్వాల్నా వాళ్లకు. ఆలోచించండి.’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆనాడు రైతులను అష్టకష్టాలు పెట్టిన దిక్కుమాలినోళ్లు వచ్చి ఇప్పుడు ఓటు వేయమంటే వేద్దామా? అని ప్రశ్నించారు. 70 ఏండ్లలో చేయని పనులు ఇవాళ సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేసుకున్నామని, ఇంకా చేసుకుందామని అన్నారు. ఇప్పటివరకూ దేశంలోనే ఎవరూ ఆలోచన చేయని విధంగా రైతు బంధు పథకం తీసుకొచ్చి రూ.73.74 కోట్లను రైతుల ఖాతాలో జమచేసినట్టు చెప్పారు. నాడు 200 రూపాయలు పెన్షన్ వచ్చేదని, నేడు 2 వేలు ఇస్తున్నామని.. నాడు 26 లక్షల మందికి ఇస్తే.. ఇప్పుడు 46 లక్షల మందికి అందజేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ తమ పెద్ద కొడుకు అని, తమ పిల్లలు చూసినా, చూడకున్నా కేసీఆర్ చూస్తుండని ఇవాళ అవ్వలందరూ ఆనందంగా చెప్తున్నారని కేటీఆర్ అన్నారు.
మాది వసుధైక కుటుంబం
ప్రధాని మోదీ తమది కుటుంబ పాలన అని విమర్శిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అవును తమది 4 కోట్ల మందితో కూడిన వసుధైక కుటుంబం అని చెప్పారు. ‘మీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం’ అని మోదీపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల కుటుంబ పెద్ద అని, 70 లక్ష ల మంది రైతన్నలకు రైతు బంధు ఇచ్చి ఆదుకుంటున్న వారి సోదరుడని పేర్కొన్నారు. అమరుల త్యాగాల స్ఫూర్తితో రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
దశబ్దాల నుంచి మలక్‌పేట అంటే.. టీవీ టవర్ గుర్తుకువచ్చేది. ప్రస్తుతం 21 అంతస్థులతో నిర్మిస్తున్న ఐటీ టవర్ మలక్‌పేట ప్రాంతానికి ఐకాన్ ల్యాండ్‌మార్క్‌గా మారనున్నది.
-మంత్రి కేటీఆర్
కాంగ్రెస్‌ను ఓట్లతోనే సావగొట్టాలి
60 ఏండ్లుగా కరెంటు, తాగునీరు, సాగునీరు ఇవ్వక సావగొట్టిన కాంగ్రెస్ పార్టీని ఓట్లతోనే సావగొట్టాలని మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమ.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు ఎన్నటికీ ఉండదని చెప్పారు. మరోసారి పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని, పని చేసే నాయకులను ప్రోత్సహించాలని కోరారు. 60 ఏండ్ల పాలనలో ఫ్లోరోసిస్‌ను కాంగ్రెస్ పార్టీ పాపంలాగా పెంచి పోషిస్తే.. ఆ ఫ్లోరోసిస్‌ను తరిమేసిన మొనగాడు సీఎం కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సూర్యాపేటలో జల సాధన సమితి నేత దుశ్చర్ల సత్యనారాయణ కలిసి ఫ్లోరోసిస్‌ను రూపుమాపినందుకు నల్లగొండలో 12కు 12 స్థానాల్లో గులాబీ జెండా ఎగురాలని ఆకాంక్షించారని, ఇదే విషయం నల్లగొండ ఆడబిడ్డలకు చెప్పాలని తనకు సూచించారని తెలిపారు. విద్య, వైద్యం, సంక్షేమం, పట్టణ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, కరెంటు.. ఇలా ఏ రంగాన్ని చూసినా సీఎం కేసీఆర్ అద్భుత పాలన ప్రజల ముందు ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల దవాఖాన, జిల్లాకో మెడికల్ కాలేజీని మంజూరు చేశారని గుర్తు చేశారు.
మోదీ అబద్ధాలకు అంతే లేదు!
ప్రధాని మోదీ చెప్పే అబద్దాలకు అంతూపొంతూ.. హద్దూపద్దూ లేదని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘కేసీఆర్‌గారు రుణమాఫీ చేయలేదట. రైతులు సచ్చిపోయిండ్రట. ఒక ప్రధానిగా ఉండి ఇలా అబద్ధాలు చెప్పొచ్చా? రెండుసార్లు 37 వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసిన ఒకే ఒక్క సీఎం కేసీఆరే’ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
Ktr3
50 ఏండ్లు అధికారంలో ఉండి 200 పెన్షన్ ఇవ్వనోడు.. ఇవాళ 4 వేల రూపాయలు ఇస్తామంటే నమ్ముదామా? 6 గంటల కరెంట్ ఇవ్వనోడు.. 24 గంటల కరెంట్ ఇస్తామంటే నమ్ముదామా? ఆరు దశాబ్దాలు మోసం చేసినోళ్లు.. ఆరు గ్యారెంటీలు అంటే నమ్మి మోసపోదామా? కరెంట్, నీళ్లివ్వని మొఖాలు చెప్పే మాటలు విని ఓటేద్దామా? ఆలోచించండి.
-మంత్రి కేటీఆర్
1,350 కోట్లతో నల్లగొండ అభివృద్ధి
‘నల్లగొండను 1,350 కోట్ల రూపాయలతో తీర్చిదిద్దుతున్నాం. తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఈ పనులు అయ్యేవా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇన్ని పనులు ఎన్నటికన్నా అవుతుండేనా?’ అని కేటీఆర్ ప్రశ్నిచారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీని, దవాఖానను మంజూరు చేశారని చెప్పారు. పని చేయాలంటే ప్రజల మీద ప్రేమ, ఇచ్చిన మాట మీద గౌరవం ఉంటే నిధులు అవే వస్తాయని, అందుకు నల్లగొండనే ఉదాహరణ అని పేర్కొన్నారు. .
అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్
బీఆర్ఎస్ స్టీరింగ్ సీఎం కేసీఆర్ చేతిలో, ఎంఐఎం స్టీరింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేతుల్లో భద్రంగా ఉందని.. కానీ, బీజేపీ స్టీరింగ్ మాత్రం.. ప్రధాని మోదీ చేతిలో కాకుండా ఆదానీ చేతిలో ఉన్నదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరిగిందని చెప్పారు. మలక్‌పేటలో నిర్మిస్తున్న ఐటీ టవర్ ప్రాజెక్ట్‌ను 36 నెలల్లో పూర్తి చేస్తామని, ఆ తర్వాత అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడకు వచ్చే విధంగా అందరం కలిసి కృషిచేద్దామని తెలిపారు. అవసరమైతే ఎమ్మెల్యే, ఎంపీతో కలిసి యూఎస్ఏ, మిడిల్ ఈస్ట్‌లో కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపేందుకు డెలిగేషన్ తీసుకెళ్తామని చెప్పారు. టీఎస్ఐఐసీ ఎండీ వెంకట్రాంరెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చొరవతోనే సూర్యాపేట అభివృద్ధి: మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేటలో కనీవినీ ఎరుగని రీతిలో వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నాననంటే దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవేనని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఏడున్నర వేల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధ్ది పనులు చేసినట్టు చెప్పారు. ఐటీ హబ్ ఇక్కడకు రావడం మంత్రి కేటీఆర్‌కు ఉన్న దార్శనికత, పలుకుబడే కారణమని పేర్కొన్నారు. ఇవాళ దేశంలో ఐటీ మంత్రి ఎవరంటే కేటీఆర్ అనుకుంటారు తప్ప.. దేశానికి ఐటీ మంత్రి ఎవరంటే ఎవరికీ తెలియదని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమ భరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆరు గ్యారెంటీలపై పిట్టకథ!
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలంటే నాకు చిన్న కథ గుర్తుకొచ్చింది. సూర్యాపేటలో ఒక ముసలామె. ఆమెకు 135 ఏండ్లు. పుట్టబోయే ముని మనువడికి కుల్లా కుట్టడం మొదలుపెట్టింది. అది సాయంత్రం పూట.. ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కంటి వెలుగు కార్యక్రమం లేదు. ఆమె కుడుతూ కుడుతూ సూది కింద పడింది. దేవులాడింది. అటూ ఇటూ చూసింది. గోడమీద మల్లన్న దిక్కు చూసింది. మల్లన్న నాకు సూది దొరికితే 5 కిలోల చక్కెర, 6 కిలోల బెల్లం, 500 కొబ్బరికాయలు కొడుతానని మొక్కింది. ఇది విన్న కోడలు వంటింట్లో నుంచి ఉరికొచ్చి అత్తా సూది కోసం ఎవరైనా ఇన్ని మొక్కుతారా? అని అడిగింది. కోడలా నీకు పిచ్చిబట్టింది. ముందు సూది దొరకనియ్యి ఆ తరువాత మల్లన్న వస్తడా.. అడుగుతడా? యాడ దొరుకుతా నేను అన్నది. ముసలి నక్క కాంగ్రెస్ గురించి చెబుతున్న నేను. కాంగ్రెస్‌ను నమ్మితే గొర్రెల మందకు తోడేలును కాపాలా పెట్టినట్టే.
-మంత్రి కేటీఆర్
ఒకడొచ్చి మాది వారసత్వ రాజకీయం అంటాడు. అవును రాణిరుద్రమ రాజసంతో వెలిగిన కాకతీయుల వారసత్వం మాది. మాది తెలంగాణ తెగువ. అందుకే రాణిరుద్రమ పౌరుషంతో గొలుసుకట్టు చెరువులు బాగు చేసుకున్నాం.
-మంత్రి కేటీఆర్
Ktr3