హైదరాబాద్ : ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి అకాల మరణం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లోని గౌతమ్ రెడ్డి ఇంటికి కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం వెళ్లారు. గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి కేటీఆర్ నివాళులర్పించి, పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. గౌతమ్ రెడ్డితో తనకు 12 ఏండ్లుగా పరిచయం ఉందన్నారు. ఉజ్వల భవిష్యత్ ఉన్న నాయకుడు గౌతమ్ రెడ్డి అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది అని కేటీఆర్ తెలిపారు.
సోమవారం ఉదయం గౌతమ్ రెడ్డికి గుండెపోటు రావడంతో.. హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చే లోపే గౌతమ్ రెడ్డి కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. వారం రోజులపాటు దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్న గౌతమ్ రెడ్డి.. రెండు రోజుల క్రితమే హైదరాబాద్కు చేరుకున్నారు. ఇటీవలే కొవిడ్ బారిన పడ్డ గౌతమ్ రెడ్డి త్వరగానే కోలుకున్నారు. పోస్టు కొవిడ్ పరిణామాలే గుండెపోటుకు కారణమై ఉండొచ్చని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు అనుమానిస్తున్నారు.