హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రైతులకు, ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ నిర్ణయాన్నీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే తన దృష్టికి తేవాలని, అవసరమైతే సవరించడమో, సరిచేయడమో, లేదంటే నిబంధనలనే మార్చుకోవడమో చేద్దామని అధికారులకు సూచించారు. కామారెడ్డిలో మాస్టర్‌ప్లాన్ ముసాయిదాపై రైతులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో.. గురువారం పట్టణ ప్రగతి వర్షాప్లో ప్రసంగిస్తున్న మంత్రి కేటీఆర్ ఆ సంఘటనపై స్పందించారు. అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు.
మాస్లర్‌ప్లాన్ రూపకల్పన ముసాయిదా దశలోనే ఉందని కామారెడ్డి అదనపు కలెక్టర్ మంత్రి దృష్టికి తెచ్చారు. ఆ సంగతి ప్రజలకు తెలుపాల్సిన అవసరం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. కామారెడ్డిలోని 500 ఎకరాలను పారిశ్రామిక జోన్లోకి మార్చారంటూ రైతులు ఆందోళన చేస్తున్నారని, వారికి వాస్తవాలేమిటో అధికారులు తెలియజెప్పాలని సూచించారు. టీఎస్‌బీపాస్ పైనా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదనేది కమిషనర్లు, అదనపు కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తేవాలని మంత్రి ఆదేశించారు. ఇండ్ల నిర్మాణ అనుమతుల్లో ఎలాంటి అవినీతి ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం టీఎస్‌బీపాస్‌ను తీసుకువచ్చిందని, ఇప్పటివరకు దాదాపు 1,78,000 దరఖాస్తులకు అనుమతులు జారీ అయ్యాయని వివరించారు. టీఎస్‌బీపాస్‌పై అదనపు కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.