Minister KTR | న్యూఢిల్లీ, జూన్ 23 (నమస్తే తెలంగాణ): దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో స్కైవేల నిర్మాణానికి కేంద్రం ఎందుకు సహకరించడం లేదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని తొమ్మిదేండ్లుగా కేంద్రాన్ని కోరుతున్నా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం వైఖరి మారకపోతే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం ఢిల్లీలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన తరువాత మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు చేయూతనిస్తే దేశానికి కూడా లాభం జరుగుతుందన్న విషయాన్ని పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. గత తొమ్మిదేండ్లలో రక్షణశాఖ మంత్రులుగా పనిచేసిన మనోహర్ పారికర్, సుష్మాస్వరాజ్, నిర్మల, రాజ్‌నాథ్‌సింగ్‌ను 15 నుంచి 20 సార్లు కలిశామని పేర్కొన్నారు. స్వయంగా ప్రధాని మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసినా కనీస స్పందన లేదని అసహనం వ్యక్తంచేశారు. ఐటీ, ఫార్మా, బయోటెక్, ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్‌సైన్సెస్, వ్యాక్సిన్ల తయారీ ఇలా అనేక రంగాల్లో అద్భుతమైన ప్రగతితో ముందుకు పోతున్న హైదరాబాద్ నగర అభివృద్ధికి సహకరించాలని అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశామని గుర్తుచేశారు. తొమ్మిదేండ్లలో హైదరాబాద్ నగర అభివృద్ధికి కేంద్రం నుంచి ప్రత్యేకంగా అందింది గుండు సున్నా అని చెప్పారు. 2020లో వరదలకు హైదరాబాద్ అతలాకుతలమైనా ఒక్క పైసా సాయం చేయలేదని విమర్శించారు. స్కైవేలకు భూమి ఇస్తే దానికి బదులుగా అంతే విలువైన భూమి ఇస్తామని చెప్పామని తెలిపారు.
రాజీవ్ రహదారిలో 96 ఎకరాలు ఇవ్వాలి
రాజీవ్ రహదారి మార్గంలో దుబ్బాక నుంచి శామీర్‌పేట దాకా ఎంత సమయం పడుతున్నదో.. శామీర్‌పేట నుంచి హైదరాబాద్‌సిటీ లోపలికి వచ్చేందుకు అంతకంటే ఎక్కువ సమయం పడుతున్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. రాజీవ్ రహదారిలో 96 ఎకరాల కంటోన్మెంట్ ల్యాండ్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని వివరించారు. ప్యాట్నీ నుంచి నాగ్‌పూర్ హైవేలో 18.6 కిలోమీటర్ల మేర స్కైవే నిర్మాణానికి 56 ఎకరాలు అవసరమని చెప్పారు. ఈ మార్గం నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలతోపాటు నగరవాసులకు అనుగుణంగా ఉంటుందని వివరించారు. ఈ రెండు స్కైవేలకు డీపీఆర్ కూడా సిద్ధమైందని, అనుమతిస్తే వెంటనే హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో పనులు ప్రారంభిస్తామని స్పష్టంచేశారు. హైదరాబాద్‌లో స్కైవాక్‌లు నిర్మిస్తున్నామని, ఉప్పల్ స్కైవాక్‌ను సోమవారం ప్రారంభిస్తామని వెల్లడించారు. మెహిదీపట్నం రైతుబజారు వద్ద స్కైవాక్ నిర్మాణానికి రక్షణశాఖకు చెందిన అర ఎకరం స్థలం అవసరం కాగా, కేంద్రం ఇవ్వడం లేదని విమర్శించారు.
142 లింక్ రోడ్ల నిర్మాణాలకు సహకరించాలి
హైదరాబాద్‌లో కొత్తగా 142 లింకు రోడ్ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించామని, వాటిలో.. ఒకటి, రెండు రక్షణ రంగానికి చెందిన భూములు అడ్డం వస్తున్నాయని, వాటిని కూడా ఇవ్వాలని కేంద్ర మంత్రికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశామని కేటీఆర్ వెల్లడించారు. కారిడార్ 153లో గోల్కొండ దగ్గర ఎకరం 16 గుంటలు, కారిడార్ 138 ఇబ్రహీంబాగ్ దగ్గర 5 ఎకరాల 14 గుంటలు కావాలని కోరామని వెల్లడించారు. దీంతో పాటు కంటోన్మెంట్ ఏరియాలోని లీజు భూములను జీహెచ్ఎంసీకి బదలాయించాలని కోరామని తెలిపారు. తద్వారా ప్రజలకు ఉపయోగపడే కమ్యూనిటీ హాళ్లు, హౌజింగ్, బస్తీ దవాఖానలు, ఇతర సదుపాయాలు కల్పించడం సులభం అవుతుందని వివరించారు. లక్డీకాపూల్-బీహెచ్ఈఎల్, నాగోల్-ఎల్బీనగర్ వరకు మెట్రో విస్తరణతోపాటు పటాన్చెరు నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో విస్తరణకు సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఫేజ్-2 మెట్రో పనులకు సంబంధించిన డీపీఆర్‌ను గత ఆక్టోబర్‌లోనే అందజేశామని గుర్తుచేశారు. మెట్రో కోసం అందజేసిన డీపీఆర్‌తోపాటు ఎంఎంటీఎస్ విస్తరణకు కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇప్పటికే చెల్లించిందని గుర్తుచేశారు. అయినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వీటిపై కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ను కలుస్తామని చెప్పారు. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు కింద 35 అండర్‌పాస్‌లు, 35 ఫ్లైఓవర్లు పూర్తి చేశామని కేటీఆర్ వివరించారు.అయితే, రసూల్‌పుర జంక్షన్లో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్టు తెలిపారు. రసూల్‌పుర జంక్షన్లో మూన్నాళ్లుగు ఎకరాల భూమిని ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరినా ఫలితం లేదని చెప్పారు. దీనిపై కేంద్ర హోం మంత్రి అపాయింట్మెంట్ అడిగామని, సమయం ఇస్తే తప్పకుండా కలుస్తామని తెలిపారు. కేటీఆర్ వెంట రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి ఉన్నారు.