Minister KTR | హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి విని అమెరికా పారిశ్రామికవేత్తలే ఆశ్చర్యపోతున్నారని, తమ దేశంలో కూడా ఇలాంటి అద్భుత విధానం లేదని చెప్పారని ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. అభివృద్ధిలో ప్రపంచానికి బెంచ్ మార్క్‌గా నిలువటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ నేడు సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధికి కేరాఫ్‌గా మారిందని అన్నారు. వ్యవసాయం నుంచి ఐటీ వరకు, పల్లె నుంచి పట్టణం వరకు ప్రగతి పరుగులు తీస్తున్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా టీఎస్ఐఐసీ, టీఐఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం దండుమల్కాపూర్‌లోని ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో పారిశ్రామిక ప్రగతి వేడుకలు నిర్వహించారు.
మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని 51 పరిశ్రమలను ప్రారంభించడంతోపాటు 106 ఎకరాల్లో నిర్మించనున్న టాయ్స్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి సాధిస్తున్నదని తెలిపారు. పర్యావరణం, పారిశ్రామిక రంగంలో భారతదేశంలోనే అగ్రభాగాన నిలిచినట్టు చెప్పారు. తెలంగాణ తరహా సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి దేశంలోనే ఒక అరుదైన దృశ్యమని పేర్కొన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ వివిధ రాష్ర్టాలకు ఇచ్చిన ర్యాంకుల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో పరిశ్రమలకు సత్వర అనుమతులు ఇచ్చే విషయంలో ప్రథమ స్థానంలో ఉన్నదని గుర్తుచేశారు.
స్థానిక పారిశ్రామికవేత్తల కోరికమేరకు కొయ్యలగూడెం నుంచి దండుమల్కాపూర్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్‌కు నీటిని సరఫరా చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు వెంటనే అధికారులకు ఆదేశాలిస్తున్నామని పేర్కొన్నారు. దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్‌లో త్వరలో రైస్ హబ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో వరిధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నుల నుంచి మూడున్నర కోట్ల టన్నులకు పెరగటం అతిగొప్ప విజయమని పేర్కొన్నారు. ఐటీ ఎగుమతులు రూ.56 వేల కోట్ల నుంచి రూ.2.41 లక్షల కోట్లకు పెరిగాయని, ఐటీ ఉద్యోగుల సంఖ్య మూడు లక్షల నుంచి 9.05 లక్షలకు పెరిగిందని వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి గురించి వాస్తవాలు ప్రచారం చేయాలని పారిశ్రామికవేత్తలకు, మీడియాకు సూచించారు. ‘మా ప్రభుత్వానికి బాకా ఊదాలని చెప్పను. కనీసం తెలంగాణ రాకముందు పరిస్థితి ఎలా ఉండేదో.. నేడు ఎలా ఉన్నదో చెప్తే చాలు. మాకు వకాల్తా పుచ్చుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.
అమెరికా పర్యటన సందర్భంగా ఓ పెద్ద సంస్థ చైర్మన్‌ను కలిసి టీఎస్ ఐపాస్ గురించి చెప్తే ఎంతో ఆశ్చర్యపోయారని, ఇలాంటి విధానం ఎక్కడా లేదని చెప్పారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పారిశ్రామికవేత్తలతో ఏడు గంటలపాటు సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్, ప్రపంచంలోని అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలని కోరినట్టు గుర్తుచేశారు. దీంతో టీఎస్ ఐపాస్‌కు రూపకల్పన జరిగిందని, దీంతో తొమ్మిదేండ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించామని పేర్కొన్నారు.
‘తెలంగాణలో ఏం అభివృద్ధి జరిగింది?. ఏ రంగంలో జరిగింది? మేము ఉన్నప్పుడే చేసినమని కొంతమంది మాట్లాడుతున్నరు. వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’ అని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో వ్యవసాయరంగ ప్రగతిని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా చెప్తారని అన్నారు. విద్యుత్తురంగంలో వచ్చిన మార్పునకు లాండ్రీ, హెయిర్ సెలూన్, ఏ కిరాణా దుకాణానికి వెళ్లినా సమాధానం దొరుకుతుందని చెప్పారు. 2014లో పరిశ్రమల పరిస్థితి ఎట్లా ఉండేది? ఇప్పుడెలా ఉన్నదని అన్నారు. స్వరాష్ట్రంలోనే పారిశ్రామికవేత్తలకు సముచిత స్థానం లభిస్తున్నదని తెలిపారు. ప్రస్తుతం ఉపాధి కల్పించే రాష్ట్రంగా పేరు తీసుకొచ్చామని చెప్పారు. ఇదంతా సీఎం కేసీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషి ఫలితమేనని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణకు హరితహారం కార్యక్రమం మానవ చరిత్రలోనే మూడో అతిపెద్ద ప్రయత్నమని కేటీఆర్ తెలిపారు. ఇది 240 కోట్ల మొక్కలు నాటిన మహా యజ్ఞమని పేర్కొన్నారు. హరితహారం వల్ల రాష్ట్రంలో 5.13 లక్షల ఎకరాల్లో కొత్తగా అడవి ఏర్పడిందని, తద్వారా 7.7 శాతం గ్రీన్ కవర్ పెంపు సాధ్యమైందని వెల్లడించారు. భవిష్యత్తు తరాలకు ఇది వరం అని పేర్కొన్నారు. దేశ జనాభాలో తెలంగాణది మూడు శాతమే అయినా జాతీయ పంచాయతీ అవార్డుల్లో 30 శాతం మనకు వచ్చాయని తెలిపారు. 26 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు గెలిచి అత్యధిక అవార్డులు సాధించిన రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. పల్లెలు, పట్టణాలు ప్రగతిబాటన పరుగులు పెడుతున్నాయని అన్నారు. పెన్షన్‌తో వృద్ధులు, ప్రోత్సాహకాలతో పారిశ్రామివేత్తలు అనందంగా ఉన్నారని చెప్పారు.
తెలంగాణ ఏర్పడితే పరిశ్రమలు పోతాయని, పెట్టుబడులు రావని, ఇక్కడ నాయకత్వ దక్షత లేదని చాలామంది వెక్కిరించారని, నేడు తెలంగాణ దేశానికే పాఠాలు చెప్పేస్థాయికి ఎదగటంతో వారంతా నోరెళ్లబెట్టి చూస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరం న్యూయార్క్‌లా ఉన్నదని సినీనటుడు రజినీకాంత్ ప్రశంసించటం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. తెలంగాణలో ఏం జరుగుతున్నదో తెలువాలంటే పక్క రాష్ర్టాలకు వెళ్లి రెండుమూడు రోజులు ఉండి రావాలని తాను అన్న మాటలను కొందరు రాద్ధాంతం చేశారని, అటువంటివారు ఇతర రాష్ర్టాల్లో ఏమి జరుగుతున్నదో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. గుజరాత్లో ఎండాకాలంలో పరిశ్రమలకు వారానికి రెండురోజులు పవర్ హాలిడేలు ఇస్తున్నారని, 27 ఏండ్లపాటు బీజేపీ అధికారంలో ఉన్న ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో పవర్ హాలిడేలు వాస్తవమా.. కాదా? అని ప్రశ్నించారు.
తాగు, సాగునీటి రంగాల్లో ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ లాంటి ప్రగతి జరిగిందా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘ఎక్కడ పచ్చదనం మొదలైతే అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం మొదలైనట్టు, ఎక్కడ పచ్చదనం ముగిస్తే అక్కడికి తెలంగాణ బోర్డర్ అయిపోయినట్టు అని ట్రక్కు డ్రైవర్లు చెప్తున్నారు. స్థానిక సంస్థల బడ్జెట్లో 10 శాతం పచ్చదనం కోసం కేటాయించిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? గ్రీన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సీఎం ఎవరైనా ఉన్నారా? మన సీఎం వచ్చే ఎన్నికల గురించి కాకుండా రానున్న తరాల గురించి ఆలోచిస్తున్నారు’ అని కొనియాడారు. 65-66 ఏండ్లలో జరిగిన అభివృద్ధికి మించి సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రగతి సాధించిందని చెప్పారు. ‘అమెరికా సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ ప్రతినిధులు కాళేశ్వరం ప్రాజెక్టును ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయారని,. తెలంగాణ నుంచి ఎన్నో దేశాలు పాఠాలు నేర్చుకోవచ్చు అన్నారు’ అని చెప్పారు.
సూర్యాపేట, జూన్ 6 (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక పార్కు ఎలా ఉన్నది? అంతా ఓకేనా? ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఉత్పత్తులు బాగా చేస్తున్నారా? వ్యాపారాలు ఎలా ఉన్నాయి? అంటూ మంత్రి కేటీఆర్ పారిశ్రామికవేత్తలను కుశల ప్రశ్నలు వేశారు. దాదాపు 40 మందితో 45 నిమిషాలపాటు మాట్లాడారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ హరిత పారిశ్రామిక ప్రాంగణం (గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు)లో 51 పరిశ్రమలతోపాటు కామన్ ఫెసిలిటీ సెంటర్‌ను విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ పరిశ్రమల ఉత్పత్తులతో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను కేటీఆర్ పరిశీలించారు.
లుక్ ఈస్ట్ పాలసీలో ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో అనేక పారిశ్రామిక వాడలు వస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే దండుమల్కాపురంలో దశలవారీగా 1,850 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు నెలకొల్పుతున్నామని తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే మేటిగా నిలిచేలా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటుచేశామని చెప్పారు. ఆయా పరిశ్రమల్లో తయారైన ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకొన్నారు. రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తున్నది? ఉత్పత్తులకు మార్కెటింగ్ ఎలా ఉన్నది? అని వాకబు చేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా దరఖాస్తు చేస్తే సింగిల్ విండో పద్ధతిలో ఒకేసారి అన్ని అనుమతులు రావడం బాగున్నదని, తెలంగాణ విధానమే బెస్ట్ అని పారిశ్రామికవేత్తలు చెప్పటంతో మంత్రి సంతోషం వ్యక్తంచేశారు. పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలని కోరారు.
దండుమల్కాపూర్ పారిశ్రామిక పార్క్‌లో స్థానిక యువతకు శిక్షణనిచ్చి ఉద్యోగాలు కల్పించాలని పారిశ్రామికవేత్తలను మంత్రి కేటీఆర్ కోరారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. పారిశ్రామికవాడలో పూర్తిస్థాయిలో పరిశ్రమలు వస్తే 40 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇబ్రహీంపట్నం, మునుగోడు, ఆలేరు, భువనగిరి యువతకు అవకాశాలు ఇవ్వాలని సూచించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు ప్రభాకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, గ్యాదరి కిశోర్, లింగయ్య, సునీతా మహేందర్‌రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఐఎఫ్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.
పరిశ్రమల స్థాపనకు తెలంగాణ పారిశ్రామిక విధానం చాలా బాగున్నది. ఇతర రాష్ర్టాల్లో ఇలాంటి విధానం లేదు. ఇక్కడ సింగిల్ విండో విధానంలో దరఖాస్తు చేస్తే 15 రోజుల్లోనే అన్ని అనుమతులు లభించాయి. ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలు స్థాపించాలంటే దాదాపు 15కు పైనే శాఖలకు దరఖాస్తులు చేసి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ పారిశ్రామిక విధానం బాగున్నదని పుణెలో పలువురు పారిశ్రామికవేత్తలు అన్నారు. ఇప్పుడు ప్రత్యక్ష్యంగా చూస్తున్నా. భవిష్యత్తులో తెలంగాణకు మరిన్ని పరిశ్రమలు రావడం ఖాయం.
– నవీన్, లుఫిక్ టెక్నిమెంట్ యజమాని
తెలంగాణ రాష్ట్రం వచ్చాక పారిశ్రమరంగంలో సాధించిన అభివృద్ధికి దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు నిదర్శనం. 2014 తర్వాత తెలంగాణలో 109 పారిశ్రామికవాడలు ఏర్పాటయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పరిశ్రమలు తరలిపోతాయని, చీకట్లు అలుముకొంటాయని, హింస చెలరేగుతుందని ఎన్నో విధాలుగా దుష్ప్రచారం చేశారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే నిరంతర విద్యుత్తు అమల్లోకి వచ్చింది. ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తున్న విధానం దేశంలో ఎక్కడా లేదు.
– సుధీర్‌రెడ్డి, తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు
గతంలో పరిశ్రమల స్థాపనకు అనుమతులు పొందాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. తెలంగాణ గవర్నమెంట్లో పేపర్ వర్క్‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొంటే ఎంత సమయం పడుతుందోనని భయపడ్డాం. కానీ, 10 రోజుల్లోనే అనుమతులు వచ్చాయి. ఇంత ఈజీగా అనుమతి రావడం సంతోషంగా ఉన్నది. ఎలాంటి ప్రాంతీయ బేధాలు లేకుండా పరిశ్రమను కేటాయించారు. దాంతో విక్టరీ బయోజెనిటిక్ ఆగ్రికల్చర్ మందులకు సంబంధించిన పరిశ్రమను రూ.11కోట్లతో స్థాపించాం. ప్రస్తుతం 25 మంది పని చేస్తున్నారు. మరింత ఉపాధి అవకాశాలు పెంచుతాం. ఇలాంటి ప్రభుత్వం ఎక్కడా ఉండదు.
– వీ శ్రీనివాస్‌రావు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్
మాది మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని రాంపల్లి గ్రామం. మధ్య తరగతి కుటుంబం. కుటుంబానికి అండగా నిలువాలని రెండేండ్ల క్రితం వివిధ రకాల చాక్లెట్ల తయారీ పరిశ్రమను హైదరాబాద్‌లోని చర్లపల్లిలో నెలకొల్పాం. మలేషియా నుంచి రా మెటీరియల్ దిగుమతి చేసుకొని తయారుచేసి పెద్దపెద్ద బేకరీలకు సరఫరా చేస్తున్నాం. ఈ క్రమంలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు గురించి తెలుసుకొని యూనిట్ నెలకొల్పాలనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సబ్సిడీ ఇవ్వడంతో వెయ్యి గజాల్లో రూ.1.50 కోట్లతో పరిశ్రమను ఏర్పాటుచేశాం. ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాల మహిళలకు చేయూతనివ్వడం బాగున్నది. ప్రభుత్వ పథకాలతోనే మా లాంటి కుటుంబాలు సొంత పరిశ్రమలను స్థాపిస్తున్నాయి.
-జీ మయూరి, ఆర్కే ఫుడ్స్ యజమాని