హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుకు మరో అంతర్జాతీయ కార్యక్రమానికి ఆహ్వానం అందించింది. ఈ ఏడాది అక్టోబర్ 24న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక ‘టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ టెక్ యాక్సిలరేటర్ 2023 ఫోరం’లో కీలక భాగస్వామిగా పాల్గొనాలని ‘టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్’ వ్యవస్థాపక అధ్యక్షుడు, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ లేఖ ద్వారా ఆహ్వానం పలికారు. అత్యాధుని సాంకేతిక పరిజ్ఞానం, డాటా వినియోగం ద్వారా ప్రజాసేవలను మెరుగుపర్చి, వాటిని మరింత సరసమైన ధరకు అందించేందుకు తాము ఒక విజన్‌ను రూపొందించినట్టు లేఖలో పేర్కొన్నారు. ‘మా విజన్‌కు వాస్తవరూపం ఇవ్వడంలో మీరు ముఖ్యమైన భాగస్వామి అని నమ్ముతున్నాం. అందుకే భవిష్యత్తు కోసం లీడర్ల ఫోరం అయిన మా రెండో టెక్ యాక్సిలరేటర్‌లో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం. కృత్రిమ మేథలో వచ్చిన తాజా పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తును పునర్నిర్మించడంపై దృష్టి సారించాం. ఇందులో భాగంగా రాజకీయాల్లో ఎంపికచేసిన నాయకుల బృందాన్ని సమావేశపరుస్తున్నాం. ఆయా రంగాలకు చెందిన ప్రముఖుల కీలక ప్రసంగాలు, బృంద చర్చలు, ప్రధాన సాంకేతిక అంశాలపై చర్చలు ఈ ఫోరంలో ఏర్పాటు చేస్తున్నాం’ అని వెల్లడించారు.
ఈ ఆహ్వానం తెలంగాణ ప్రగతికి గుర్తింపు: కేటీఆర్
టోనీ బ్లెయిర్ నుంచి ఆహ్వానం అందడంపట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. కృత్రిమ మేథ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమ, ఇన్నోవేషన్ తదితర రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, సాధిస్తున్న ప్రగతికి ఈ ఆహ్వానం ఒక గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు. టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ తమ స్ట్రాటజీ, పాలసీ, డెలివరీ, తాజా విశ్లేషణల ద్వారా నాలుగు ఖండాల్లోని 20కిపైగా దేశాల్లో అతిపెద్ద సవాళ్లకు ఆచరణాత్మక విధాన పరిష్కారాలను అందించేందుకు కృషిచేస్తున్నది. 1997 నుంచి 2007 వరకు బ్రిటన్, నార్తర్న్ ఐర్లాండ్‌కు ప్రధానమంత్రిగా పనిచేసిన టోనీ బ్లెయిర్ ఆకాంక్షలమేరకు ఈ ఇన్స్టిట్యూట్ పనిచేస్తుంది.