హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనువైన ప్రాంతమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. మతకల్లోలాలు, హిజాబ్, హలాల్ లాంటి వివాదాలు తెలంగాణలో మచ్చుకైనా లేవని తెలిపారు. భారత్‌లో అద్భుత ప్రతిభ కలిగిన యువత ఉన్నదని, అభివృద్ధిలో దేశం మరింత ముందుకు సాగేందుకు సాహసోపేత నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఉద్ఘాటించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో బుధవారం ఆయన జడ్ఎఫ్ కంపెనీ అతి పెద్ద టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఎకనమిక్స్‌పై దృష్టి పెట్టిందని, పాలిటిక్స్‌పై కాదని తెలిపారు.
రాజకీయాలు ఎన్నికలకే పరిమితమని, మిగిలిన ఐదు సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి సారించామని చెప్పారు. ఎవరు ఎలా పనిచేశారో, ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి, యువతకు ఉపాధి కల్పించడం కంటే ప్రభుత్వాలకు మరేదీ ముఖ్యంగా ఉండొద్దన్నారు. ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలతో చైనా పోటీపడుతుంటే మనం మాత్రం ఇంకా పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలతోనే పోల్చుకొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
జడ్ఎఫ్ను మరింత విస్తరించాలి
అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు ప్రపంచంలోనే అతి పెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లో ఉన్నదని, అదేవిధంగా జడ్ఎఫ్ సంస్థ తన అతి పెద్ద టెక్నాలజీ సెంటర్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకొన్నదని తెలిపారు. కేవలం ఐదేండ్లలోనే 2,900 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఈ సంస్థను మరింత విస్తరించాలని కోరారు. రానున్న రోజుల్లో 5 వేల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించేలా చూడాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం భారీ కంపెనీలనే కాకుండా చిన్న, మధ్యతరహా కంపెనీలను కూడా ఆకర్షిస్తున్నదని చెప్పారు.
భవిష్యత్తు మొబిలిటీ, ఎమర్జింగ్ టెక్నాలజీలదే
తెలంగాణ మొబిలిటీ వ్యాలీ (టీఎంవీ)లో భాగంగా జడ్ఎఫ్ను ఇక్కడికి ఆహ్వానించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. భారత్‌లోని రోడ్లకు అనుగుణంగా వాహనాలను రూపొందించాల్సి ఉంటుందని, అటానమస్ డ్రైవింగ్ విధానానికి సంబంధించి ఇక్కడ ప్రత్యేక ప్రోగ్రామింగ్‌ను రాయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇది ఒక సవాల్ అంటూ సరదాగా నవ్వుతూ వ్యాఖ్యానించారు.
మున్ముందు యువతకు ఉద్యోగాలు కల్పించడం, వారి ఆర్థిక ఎదుగుదలలో మొబిలిటీ, ఎమర్జింగ్ టెక్నాలజీలు కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ క్యాపిటల్‌గా హైదరాబాద్ విరాజిల్లుతున్నదని, యావత్ ప్రపంచానికి అవసరమైన వ్యాక్సిన్లలో మూడో వంతు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జడ్ఎఫ్ టెక్నాలజీ ప్రెసిడెంట్, ఇండియా రిజినల్ హెడ్ కేవీ సురేశ్, సీనియర్ ఉపాధ్యక్షుడు డ్రిక్ ఆడమ్జిక్, ఉపాధ్యక్షుడు కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు.