Goldman Sachs | ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, సెక్యూరిటీస్ సంస్థ గోల్డ్మన్ సాచ్స్ తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించడం రాష్ట్రంలో గ్లోబల్ కంపెనీల వృద్ధికి దోహదం చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. స్థానిక ప్రతిభకు ప్రపంచ స్థాయిలో అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రభుత్వ ప్రగతిశీల విధానాలతో ప్రపంచస్థాయి కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నాయని చెప్పారు. మంత్రి కేటీఆర్ గురువారం గోల్డ్మన్ సాచ్స్ హైదరాబాద్లో ఏర్పాటుచేసిన నూతన అత్యాధునిక కార్యాలయాన్ని ప్రారంభించారు.
ప్రపంచ స్థాయి సంస్థల పెట్టుబడులు, వివిధ అంతర్జాతీయ సంస్థల మధ్య భాగస్వామ్యాలకు ఈ కార్యాలయం ఓ చక్కని వేదికగా ఉంటుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2021లో హైదరాబాద్లో కార్యకలాపాలు ప్రారంభించిన గోల్డ్మన్ సాచ్స్, రెండేళ్లలోనే తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తూ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయ సంస్థలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఎదిగిందనేందుకు ఇది ప్రబల నిదర్శనమని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల ఫలితంగా నేడు హైదరాబాద్ బహుళజాతి సంస్థలకు అనుకూల ప్రాంతంగా మారిందని చెప్పారు. గ్లోబల్ కంపెనీల ఏర్పాటుకు రాష్ట్రంలో ఉన్న పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఇది దోహదపడుతుందన్నారు.
డిజిటల్ అక్షరాశ్యత, మహిళా సాధికారిత తదితర కార్యక్రమాల ద్వారా సమాజాభివృద్ధిపై గోల్డ్మన్ సాచ్స్ నిబద్ధతను అభినందించారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్తోపాటు ఆర్థిక సేవలు, బ్యాంకింగ్ రంగంలో సైతం తెలంగాణ రాష్ట్రం శరవేగంగా ముందుకు సాగుతున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు, ఇక్కడున్న అపార అవకాశాల దృష్ట్యా గోల్డ్మన్ సాచ్స్ వంటి సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయన్నారు. ఆర్థిక సేవల రంగంలో కూడా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఒక ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్నదనడానికి గోల్డ్మన్ సాచ్స్ వంటి సంస్థల రాక ఓ నిదర్శనమని కేటీఆర్ వివరించారు.