హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్న పేద గిరిజన విద్యార్థినికి మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. హైదరాబాద్ బోరబండ ప్రాంతానికి చెందిన తిరుపతి అనూష కిర్గిజిస్తాన్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు అనూష తన తల్లితో కలిసి కూరగాయలు అమ్ముతుంది. అనూష పరిస్థితిని తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. ఆమెకు ఆర్థికసాయం అందించారు. బోరబండలో నివాసముంటున్న అనూష.. ఎంబీబీఎస్‌లో మూడేండ్లలో 95 శాతం మార్కులు సాధించింది.
ఈ నేపథ్యంలో ఆమె తన వైద్య విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేశారు కేటీఆర్. అనూష ఎంబీబీఎస్ ఫీజుల బాధ్యత తాను చూసుకుంటానని కేటీఆర్ భరోసానిచ్చారు. ఈ సందర్భంగా అనూషకు కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనూష వైద్య విద్యకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్‌కు అనూషతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.