నాగర్‌కర్నూల్ : తెలంగాణకు అన్యాయం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీకి రామానుజాచార్యులు కలలో వచ్చి అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాలనే ఉపదేశం చేస్తారని కోరుకుంటున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు. తిమ్మాజిపేట ఎంజేఆర్ ట్రస్ట్ సహకారంతో అధునాతన సదుపాయాలతో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డితో కలిసి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో గత 8 ఏండ్లుగా అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటికి కష్టాలు లేవు. అన్ని చెరువుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. ఈ జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి వలసలు వస్తున్నారు. అటు రాయలసీమ, ఇటు రాయిచూర్ నుంచి పాలమూరు జిల్లాకు వలస వస్తున్నారు. దీనికి కారణం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన కార్యక్రమాలు అని కేటీఆర్ పేర్కొన్నారు.
సంక్షేమంలో, అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోంది అని కేటీఆర్ స్పష్టం చేశారు. గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ఈ గురుకుల విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని సన్నబియ్యంతో అందిస్తున్నాం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్, మహాత్మా జ్యోతిబాపులే పేరిట ఓవర్సీస్ స్కాలర్షిప్లు మంజూరు చేస్తున్నాం. దేశానికి అన్నం పెడుతున్న తెలంగాణకు కేంద్రం అండగా నిలబడటం లేదు. మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. దీంట్లో తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. కొత్తగా 8 ఐఐఎంలు మంజూరు చేస్తే తెలంగాణకు గుండు సున్నా. 100 దాకా నవోదయ పాఠశాలలు మంజూరు చేశారు. కానీ తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. విద్య విషయంలో తెలంగాణ పట్ల మోదీ నిర్లక్ష్యం వహించారు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ప్రధాని మోదీ రేపు రాష్ట్రానికి వస్తున్నారు. సమతా మూర్తి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. తెలంగాణకు మెడికల్ కాలేజీలు, నవోదయ స్కూల్స్‌తో పాటు ఇతర విద్యాసంస్థలను ఇవ్వాలని రామానుజాచార్యులు ఉపదేశం చేస్తే బాగుండు అన్నారు. అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాలనే ఉపదేశం రామానుజచార్యులు చేస్తారని కోరుకుంటున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ జిల్లాను సుసంపన్నం చేయడానికి సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగితే కేంద్రం నుంచి ఉలుకుపలుకు లేదు. కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. అందుకే రామానుజాల వారిని వేడుకుంటున్నా. మోదీకి కలలో వచ్చి ఉపదేశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాష్ట్రానికి రైల్వే లైన్లను మంజూరు చేయడం లేదు. హైదరాబాద్ – బెంగళూరు హైవేను పారిశ్రామిక కారిడార్‌గా గుర్తించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ మన విజ్ఞప్తులు అరణ్య రోదనలు అవుతున్నాయి. ఉమ్మడి పాలమూరుకు న్యాయం చేసేలా ఉపదేశం ఇవ్వాలని కోరుకుంటున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
అందరం పుడుతాం.. మనకాలపరిమితి ముగిశాక నిష్క్రమిస్తాం. పది మందికి ఉపయోగపడే పనులు చేస్తేనే చిరస్థాయిగా గుర్తుండిపోతాం. ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఎంతో కష్టపడి జీవితంలో పైకి వచ్చారు. రాష్ట్రంలోనే ఒక వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రామికవేత్తగా ఎదిగారు. అంతేకాకుండా తనకు జన్మనిచ్చిన ప్రాంతాన్ని మరిచిపోకుండా, పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్నారు. కార్పొరేట్ పాఠశాలల కంటే ఈ స్కూల్ బాగుంది. ప్రధానోపాధ్యాయుడి చాంబర్, టీచర్ల స్టాఫ్‌రూమ్, పిల్లలకు ల్యాబ్స్, భోజనశాల, గ్రౌండ్ అద్భుతంగా ఉన్నాయి. ఇంత మంచి వాతావరణం ఏ కార్పొరేట్ పాఠశాలలో కూడా లేదు. పుట్టినగడ్డ రుణం తీర్చుకోవడానికి ఒక విద్యాలయానికి నిధులు సమకూర్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రూ. 7289 కోట్లతో 26 వేల పాఠశాలలను మన ఊరు మన బడి కార్యక్రమంతో తీర్చిదిద్దుతున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.