హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంచుతూ చేనేత నోట్లో మట్టి కొడుతున్న కేంద్రంపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. టెక్స్టైల్ పరిశ్రమపై జీఎస్టీ పెంపును మంత్రి కేటీఆర్ మరోసారి ఖండించారు. కేంద్రం తీరును మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు.
మేకిన్ ఇండియా అంటూ మోదీ ఉపన్యాసాలు ఇస్తారు. స్వదేశీ వస్త్ర పరిశ్రమకు మాత్రం కేంద్రం సహకరించట్లేదు. టెక్స్‌టైల్‌పై జీఎస్టీ 5 నుంచి 12 శాతానికి పెంచుతున్నారు. జీఎస్టీ పెంపు వస్త్ర పరిశ్రమకు మరణ శాసనమే అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో మోదీ జోక్యం చేసుకుని, చేనేత కార్మికులను కాపాడాలని కేటీఆర్ అభ్యర్థించారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో ఈ నెల 21న ప్రచురితమైన బలిపీఠంపై టెక్స్టైల్స్.. తెలంగాణ వస్త్ర పరిశ్రమకు శరాఘాతం అనే కథనాన్ని కేటీఆర్ తన ట్వీట్‌కు ట్యాగ్ చేశారు.
మగ్గంపై పిడుగు👇 వస్త్ర పరిశ్రమపై #GST బాదుడు
— KTR (@KTRTRS) December 24, 2021
మేకిన్ ఇండియా అంటూ రోజు ఉపన్యాసాలు ఇచ్చే కేంద్రం… స్వదేశంలో వస్త్రాలు తయారు వస్త్ర పరిశ్రమకు సహకారం అదించాల్సింది పోయి… 5% ఉన్న GSTని 12% కి పెంచి పరిశ్రమకు మరణ శాసనం రాస్తుంది#Handlooms #Telangana #ReviseGSTonHandlooms pic.twitter.com/tPI6Kc0IPp