రాజన్న సిరిసిల్ల : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే మోదీ వద్దకు వెళ్లి వేములవాడకు రూ. 1000 కోట్ల ప్యాకేజీ తీసుకురావాలని బండి సంజయ్‌కు కేటీఆర్ సవాల్ విసిరారు. రాజన్న సిరిసిల్లలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా తోట ఆగయ్య ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరై ప్రసంగించారు.
బీజేపీ అంటే బక్వాస్ ఝూఠా పార్టీ.. లొల్లి ఎక్కువ, చేసేది తక్కువ. అందుకే ఈ కొత్త పేరు పెట్టాం. బీజేపీ బట్టలిప్పి నగ్నంగా నిలబెట్టాలి. చండాలమైన బీజేపీ పద్ధతులను ఎండగట్టాలని కేటీఆర్ సూచించారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి మూడేండ్లు అవుతోంది. ఈ కాలంలో మూడు పైసలు కూడా తేలేదు. మీ మోదీ పెద్ద పోటుగాడు కదా.. వేములవాడ రాజన్నకు పైసలు తీసుకురా. అయోధ్యకు ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వరు. సిరిసిల్ల నేతన్నలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరు. కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తరు. మనం అరిచినా, గీ పెట్టినా కూడా మనకు జాతీయ హోదా ఇవ్వరు. మోదీ కేవలం ఉత్తర భారతానికే ప్రధాన మంత్రా? తెలంగాణ ప్రజల మీద ఎందుకింత వివక్ష? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణకు సాయం చేయకుండా అడ్డగోలు మాటలు మాట్లాడుతారు అని బీజేపీ నాయకులపై కేటీఆర్ నిప్పులు చెరిగారు.
మేడారం జాతరను మినీ కుంభమేళా అంటారు. ఐదారు రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు వస్తారు. అట్లాంటి జాతరకు కేంద్రం కేవలం రూ. రెండున్నర కోట్లు మాత్రమే ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కుంభమేళాకు రూ. 375 కోట్లు ఇచ్చారు. మనకు ముష్టి వేసినట్టు రూ. రెండున్నర కోట్లు ఇచ్చారు. కిషన్ రెడ్డి సిగ్గులేకుండా.. ఇది మినీ కుంభమేళా అని అంటారు.. కానీ నిధులు మాత్రం తీసుకురారు. కరీంనగర్‌కు ఒక ట్రిపుల్ ఐటీ కావాలని అడిగితే ఇవ్వలేదు. ఈ ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఎన్ని విద్యాసంస్థలు ఇచ్చారు? అని కిషన్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.