హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): మణిపూర్‌లో చెలరేగుతున్న హింసకు తక్షణమే అడ్డుకట్టవేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మణిపూర్‌లో ఇద్దరు కుకీ తెగ మహిళలపై జరిగిన సామూహిక దాడిపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ సమస్యను తక్షణమే పరిషరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను డిమాండ్ చేశారు. ‘పిల్లలు, మహిళలపై తాలిబన్లు దాడులకు పాల్పడినప్పుడు భారతీయులందరం వ్యతిరేకించాం, కానీ ఇప్పుడు మన దేశంలోనే మహిళలను నగ్నంగా ఊరేగించి, లైంగికంగా వేధించడం కలచి వేసింది.
మన దేశంలో అనాగరికత ఏ స్థాయిలో పేట్రేగిపోయిందో తెలియజెప్పేందుకు ఇదొక మచ్చుతునక’ అని ఆయన గురువారం చేసిన ట్వీట్లో ఆందోళన వ్యక్తం చేశారు. నగ్న ఊరేగింపే నవీన భారతమా? అని ప్రశ్నించారు. నడుస్తున్న భారతంలో హింస సాధారణమైపోయిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో శాంతి భద్రతల క్షీణతకు ఈ భయానక హింసా కాండ నిదర్శనమన్నారు. పెచ్చరిల్లుతున్న హింసా కాండపై కేంద్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించటం దారుణమన్నారు.
మోదీ, అమిత్‌షా ఏం చేస్తున్నారు?
మణిపూర్ వేదికగా దేశ ప్రతిష్ట మంటగలుస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఏం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికైనా అన్ని ఇజాలను పక్కనపెట్టి కేంద్రం తక్షణమే స్పందించి మణిపూర్‌ను రక్షించాలన్నారు. మణిపూర్ మహిళలపై జరిగిన దాడులను ఏ నాగరిక సమాజం క్షమించదన్నారు. మణిపూర్ సమస్యపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడం వల్ల బాధిత సమాజం, పౌర సమాజం మరింత ఆందోళనకు గురవుతున్నదని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పౌరులుగా అందరం హింసకు వ్యతిరేకంగా నిలబడి బాధిత సమాజానికి అండగా నిలవాలని ఆయన సూచించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా అత్యున్నత స్థాయి అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని మణిపూర్ ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మణిపూర్‌లో శాంతి భద్రతలను పాదుకొల్పాలని కేటీఆర్ కోరారు.