హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): దేశంలో అత్యధిక మంది ఆహారంగా తీసుకొనే పాలు, పెరుగు, బియ్యంపై జీఎస్టీని పెంచడంపై మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జీఎస్టీ ఎందుకు పెంచారో.. సమాధానం ఏమైనా ఉన్నదా? మోదీ జీ అని ప్రశ్నించారు.ఈ దేశం కోసం మీ ప్రాధాన్యాలు ఏమిటో చెప్పాలని నిలదీశారు. జీఎస్టీ తీసుకురావడంతో రెండేండ్ల క్రితం పన్ను నుంచి బయటపడిన గోధుమలు, బియ్యం, పెరుగు, లస్సీ, మజ్జిగపై ఇప్పుడు ఎందుకు ట్యాక్స్ వేస్తున్నారో జవాబు ఇస్తారా అని ప్రశ్నిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు.
‘గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీ.. ఈ దేశం కోసం మీ ప్రాధాన్యాలు ఏమిటి?మీ నాయకత్వంలో ద్రవ్యోల్బణం 30 సంవత్సరాల గరిష్ఠస్థాయికి చేరి, యావత్ భారతదేశం బాధపడుతున్నది. ఇప్పుడు మీరు దేశ ప్రధాన ఆహారాలైన పాలు, పెరుగు, బియ్యంపై జీఎస్టీ రేట్లను పెంచాలని నిర్ణయించారు. ఈ జీఎస్టీ ఎందుకు పెంచారో మీ దగ్గర సమాధానం ఉన్నదా సార్ ?’ అని ప్రశ్నిస్తూ ముందు ఓ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ‘గోధుమలు, బియ్యం, పెరుగు, లస్సీ, మజ్జిగపై ప్రభుత్వం రేపటి నుంచి 5 శాతం జీఎస్టీ వసూలు చేయనున్నది. కానీ రెండేండ్ల క్రితం ప్రధాని మోదీ.. జీఎస్టీతో వీటన్నింటికీ పన్ను మినహాయింపు లభించిందని ప్రకటించిన వీడియో ఇది..వా మోదీ వా..’ అంటూ ఆ వీడియోను ట్వీట్లో పోస్ట్ చేశారు. ఇలా కాకుండా ‘జుమ్లా, జూట్ అండ్ ఫేక్ న్యూస్‌పై జీఎస్టీ వేస్తే.. ఇండియా ఇప్పటికే 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అయ్యేది. జుమ్లా నిర్భర్ భారత్’ అనే హాష్ట్యాగ్లో మరో ట్వీట్ చేసి ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.