Hyderabad Metro | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో మెట్రోరైలు ప్రాజెక్టు లాభసాటి కాదట. నగరంలో మెట్రో నిర్మించాల్సినంత ట్రాఫిక్ రద్దీ లేదట. ఉత్తరప్రదేశ్‌లో పట్టుమని పది లక్షలమంది కూడా ఉండని మీరట్, కాన్పూర్ పట్టణాలకంటే కూడా హైదరాబాద్‌లో మెట్రో నిర్మాణం నష్టంతో కూడుకొన్నదట. హైదరాబాద్‌లో రెండోదశ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే.. కేంద్రం చెప్పిన అచ్చమైన అబద్ధాలివి.
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండోదశ నిర్మాణం ఫీజిబిలిటీ కాదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సెలవిచ్చింది. బెంగళూరు, చెన్నైతోపాటు దేశంలో సగం జనాభాకు పేరు కూడా తెలియని పట్టణాలకు మాత్రం వేలకోట్లతో మెట్రో ప్రాజెక్టులు మంజూరుచేసింది. కేంద్రప్రభుత్వ వివక్షపై రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రయాణికుల రద్దీ తక్కువ ఉన్నదని సాకులు చెప్తూ హైదరాబాద్ మెట్రోరైల్ రెండోదశ ప్రాజెక్టును కేంద్రం తిరస్కరించటంపై ఘాటుగా స్పందించారు.
ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్సింగ్ పురికి మంగళవారం లేఖ రాశారు. అత్యంత రద్దీ కలిగిన హైదరాబాద్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ సాధ్యం కాదని చెప్తున్న కేంద్రం, తమకు అనుకూలమైన నగరాలకు మాత్రం మెట్రో రైల్ ప్రాజెక్టులు ఇస్తున్న విషయాన్ని లేఖలో ఎత్తి చూపారు. గాంధీనగర్, కొచ్చి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతోపాటు ఉత్తరప్రదేశ్‌లో చాలా తకువ జనాభా ఉన్న లక్నో, వారణాసి, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, మీరట్ వంటి పట్టణాలకు మెట్రో ప్రాజెక్టులను కేంద్రం కేటాయించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Metro
సకల వివరాలిచ్చినా కేంద్రం బుకాయింపు
హైదరాబాద్ మెట్రో రెండోదశకు సంబంధించిన సకల సమాచారంతోపాటు సమగ్ర ప్రణాళిక నివేదిక (డీపీఆర్)ను కూడా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు అందించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ, పీహెచ్‌డీటీ గణాంకాలు, ఇతర అర్హతలు, సానుకూలతలను అనేకసార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. తెలంగాణ మున్సిపల్ శాఖ తరఫున గతంలో కేంద్రానికి అందించిన సమాచార నివేదికలను కేటీఆర్ తన లేఖకు మరోసారి జతచేశారు. కేంద్రం అడిగిన అన్ని రకాల సమాచారం అందించినా, తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్తున్న నేపథ్యంలో మరోసారి సమగ్ర సమాచారాన్ని, అన్ని రకాల పత్రాలను నివేదికలను కేంద్రానికి పంపుతున్నట్టు కేటీఆర్ తెలిపారు.
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురిని వ్యక్తిగతంగా కలిసి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ ప్రాధాన్యతను వివరించేందుకు అనేకసార్లు ప్రయత్నించినా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. హరదీప్ సింగ్ పురి ఎలాంటి పక్షపాతం లేకుండా సరైన నిర్ణయం తీసుకొని తెలంగాణకు ప్రాజెక్టులు కేటాయిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదముద్ర వేయాలని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలున్నా నివృత్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కేటీఆర్ తన లేఖలో తెలిపారు.
కేంద్రం వాదన అర్థరహితం
దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరంగా పేరు పొందిన హైదరాబాద్‌లో ప్రయాణికుల సంఖ్య తకువగా ఉండే అవకాశం ఉన్నదన్న కేంద్రప్రభుత్వ వాదన అర్ధరహితమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అనేక చిన్న నగరాలు, పట్టణాలు మెట్రో రైల్ ప్రాజెక్టులకు అర్హత సాధించినప్పుడు, హైదరాబాద్ ఎందుకు ఆ అర్హత పొందదని సూటిగా ప్రశ్నించారు. వివిధ రంగాల్లోని ప్రాజెక్టులు, కేటాయింపుల విషయంలో తెలంగాణపై చూపుతున్న వివక్షను ఇప్పటికే అనేకసార్లు తమ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు స్వయంగా తాను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేశారు. ఎలాంటి అర్హతలు లేకున్నా ఇతర పట్టణాలకు, రాష్ట్రాలకు ప్రాజెక్టులను కట్టబెడుతూ తెలంగాణకు పదేపదే కేంద్రం అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. ఇది కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంపై, హైదరాబాద్ నగరంపై పక్షపాతమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు.