హైదరాబాద్ : పీహెచ్‌డీలో భాగంగా జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ విభాగంలో పరిశోధన చేసి బంగారు పతకం పొందిన తన పీఆర్వో మాణిక్య మహేశ్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా ‘గ్రామీణ అభివృద్ధిలో కమ్యూనికేషన్ వ్యూహాల మూల్యాంకనం’ అనే అంశంపై ప్రొఫెసర్ వీ సత్తిరెడ్డి ఆధ్యర్యంలో పరిశోధన చేశారు. ఈ పరిశోధన గ్రంథానికి డాక్టరేట్‌తో పాటు బంగారు పతకాన్ని తెలుగు యూనివర్సిటీ ప్రదానం చేసింది.
ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధిని ప్రజల వద్దకు మరింత వేగంగా, సమర్థవంతంగా తీసుకువెళ్లేందుకు అవసరమైన కమ్యూనికేషన్ వ్యూహాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని మహేశ్ తన అధ్యయనంలో గుర్తించారు. పరిశోధనకు బుధవారం రవీంద్రభారతిలో జరిగిన తెలుగు విశ్వవిద్యాలయ 15వ స్నాతకోత్సవంలో భాగంగా గవర్నర్ తమిలిసై సౌందర్యరాజన్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని యూనివర్సిటీ ప్రదానం చేసింది. ఈ నేపథ్యంలో తన పీఆర్వో మహేశ్‌ను ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ అభినందించారు. డాక్టరేట్‌తో పాటు ప్రత్యేకంగా బంగారు పథకాన్ని పొందడంపై హర్షం వ్యక్తం చేశారు.