హైదరాబాద్ : సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ మరణం పట్ల రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. ఏచూరి కుటుంబానికి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
కరోనా బారినపడిన ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఇవాళ తెల్లవారుజామున మృతిచెందారు. ఆశిష్‌కు రెండు వారాల క్రితం కరోనా సోకింది. దీంతో ఆయన గుర్గావ్లోని మేదాంతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం 5.30 గంటలకు ఆయన మరణించినట్లు సీతారాం ఏచూరి ట్విట్టర్ ద్వారా తెలిపారు.
‘ఈరోజు ఉదయం నా పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో చనిపోయాడని చెప్పడానికి బాధపడుతున్నాను. మాకు నమ్మకాన్ని కల్పించిన వారందరికి ధన్యవాదాలు. చికిత్స అందించిన డాక్టర్లు, నర్సులు, ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, మాకు అండగా నిలిచిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు.
ఆశిష్ ఏచూరి న్యూఢిల్లీలో ఓ ప్రముఖ దినపత్రికలో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రెండు వారాల క్రితం ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో హోళీ ఫ్యామిలీ దవాఖానలో చేరారు. అటునుంచి ఆయనను గుర్గావ్కు తరలించారు. రెండువారాలపాటు కరోనాతో పోరాడిన ఆశిష్ ఇవాళ తుదిశ్వాస విడిచారు.
Saddened to hear the news. My heartfelt condolences Yechury Garu 🙏 https://t.co/9LAw7U896q
— KTR (@KTRTRS) April 22, 2021