హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘పాలనలో విఫలమైన BIMARU (బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్) రాష్ట్రాల్లోని బీజేపీ నాయకుల చిత్తశుద్ధిని మీరు నిజంగా మెచ్చుకోవాల్సిందే’ అని సింధియాను ఉద్దేశించి వ్యం గ్యంగా వ్యాఖ్యానించారు. తెలంగాణకు వచ్చి విభజన రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు కుట్రలు చేస్తున్నారని, బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నేను సింధియాకు సవాల్ చేస్తున్నా. దమ్ముంటే మీ సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లోని ఏదైనా ఎంపీ నియోజకవర్గంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి కంటే మెరుగైన అభివృద్ధి జరిగి ఉంటే చూపించాలి’ అని ట్వీట్ చేశారు. నెటిజన్లు మంత్రి కేటీఆర్‌కు మద్దతుగా.. జ్యోతిరాదిత్య సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో రూ.529 కోట్లతో నిర్మించిన రోడ్డు ఏడాదిలోనే కూలిపోయిందని, సొంత రాష్ట్రంలో తిరగలేక ఇక్కడి వచ్చి నీతి వ్యాఖ్యలు చెప్తున్నారని బీజేపీ నేతపై మండిపడ్డారు. బీజేపీ డబుల్ ఇంజన్ అనేది ఓ డిజాస్టర్ అని, తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే ఈ పొలిటికల్ టూరిస్టులు వస్తున్నారని ట్వీట్లు చేశారు.
దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ జనాభా.. దేశానికి 5 శాతం జీడీపీని అందిస్తున్నదని మంత్రి కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. ప్రతి తెలంగాణ పౌరుడు ఈ దేశానికి డబుల్ ఇంజిన్‌గా దోహదపడుతున్నారని చెప్పారు. తెలంగాణ మాదిరిగానే బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా కష్టపడి ఉంటే 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ఈ దేశం 10 ట్రిలియన్ల ఎకానమీకి చేరుకొనే అవకాశం ఉండేదని పేర్కొన్నారు.