కొండాపూర్, జూలై 7: కాకతీయుల వైభవాన్ని ఈతరానికి, భవిష్యత్తు తరాలకు చాటిచెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. గురువారం మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కాకతీయ వైభవం పేరిట సాంస్కృతికశాఖ నిర్వహించిన ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. కాకతీయ సామ్రాజ్య వారసుడు మహారాజ కమల్ చంద్ర భంజ్‌దేవ్, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కేటీఆర్ జ్యోతి ప్రజ్వలన చేశారు.
కాకతీయ వైభవానికి ప్రతీకలుగా నిలిచిన పలు చిత్రాలను తిలకించారు. కాకతీయుల చరిత్రపై పరిశోధన చేస్తున్న అరవింద్ ఆర్యన్ కాకతీయుల విశిష్టతలను మంత్రి కేటీఆర్‌కు వివరించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఏడు శతాబ్దాల చరిత్ర కలిగిన కాకతీయుల వైభవాన్ని, గొప్పదనాన్ని తెలుసుకోవడానికి కొద్దిపాటి సమయం సరిపోదన్నారు. వారి చరిత్రను ఈతరంతోపాటు భవిష్యత్తు తరాలకు అందించేలా హైదరాబాద్, వరంగల్, రామప్పలలో జూలై 7 నుంచి 13వరకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవి, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు చారిత్రాత్మకమైనది
ఈ రోజు చారిత్రాత్మకమైనది, బస్తర్ చరిత్రలో గుర్తుండిపోతుంది. రాజు ప్రతి చర్యలు లిఖించబడతాయి. 700 సంవత్సరాల కాకతీయుల వైభవాన్ని అందరికి తెలిసేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. వరంగల్‌లో సందర్శిస్తున్నప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ఉన్న అనుభూతి కలిగింది. బస్తర్‌లో దసరా ఉత్సవాలకు కేటీఆర్‌ను ఆహ్వానించా.
-కమల్ చంద్ర భంజ్‌దేవ్, కాకతీయ వారసుడు