హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): ‘రోడ్డున పోయే దానయ్యలు.. అప్పుడప్పుడు వచ్చే పొలిటికల్ టూరిస్టులు కొట్టే డైలాగులకు మోసపోతే గోసపడేది మీరే. మంచి ముఖ్యమంత్రి… హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలపాలని చిత్తశుద్ధితో మమ్మల్ని అందరినీ నడిపించే అంకితభావం ఉన్న ముఖ్యమంత్రిని హ్యాట్రిక్ కొట్టేలా తిరిగి గెలిపించుకోవాలి’ అని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రజలకు పిలుపునిచ్చారు. బేగంపేట ధనియాలగుట్టలో రూ.8.54 కోట్లతో అధునాతనంగా నిర్మించిన మాడ్రన్ వైకుంఠధామాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నోటికొచ్చినట్టు దూషించడం సులువేనని, అభివృద్ధి చేయడమంటేనే చిత్తశుద్ధి, అంకితభావం ఉండాలని అన్నారు.
‘మాకూ తిట్టడం వచ్చు. కానీ ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం ఇచ్చినందున వారి బాగు కోసం ఏం చేస్తున్నామనేదే ఇప్పుడు మాకు ముఖ్యం. గతంలో హైదరాబాద్‌లో వరదలు వచ్చినపుడు ఇదే పెద్దపెద్ద గొంతులేసుకొని మాట్లాడే బీజేపీ నాయకులు ఒక్క రూపాయి తెచ్చారా? వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం రూ.660 కోట్లు సాయం చేస్తే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆరు పైసలైనా ఇచ్చిందా?’ అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నా.. ప్రతిపక్షాలు కండ్లున్న కబోదుల్లా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణకు ఇంత భారీస్థాయిలో ఐటీ, పారిశ్రామక రంగ పెట్టుబడులు వస్తున్నాయంటే అందుకు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాజకీయ స్థిరత్వమున్న ప్రభుత్వం ఒక కారణమైతే, మంచి సామర్థ్యం (ఎబిలిటీ) ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ మరో కారణమని అన్నారు. సామాన్య, పేద ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడు అయినందునే రాష్ట్రంలో ఇంటింటికీ మంచినీళ్లు, పచ్చదనం, పారిశుద్ధ్యం, పట్టణ, పల్లె ప్రగతిలో తెలంగాణ అనేక అవార్డులు గెలుచుకొని దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
అమెరికాలో వైట్ హౌజ్.. హైదరాబాద్‌లో కొత్త సచివాలయం: మంత్రి తలసాని
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరిట నిర్మించిన తెలంగాణ నూతన సచివాలయం అద్భుతంగా ఉన్నదని, అమెరికాలో వైట్ హౌజ్.. హైదరాబాద్‌లో కొత్త సెక్రటేరియట్ అని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. అధికారంలో ఉండే అవకాశం వచ్చినపుడు పేద, మధ్యతరగతి, బడుగు బలహీనవర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు చేపడితేనే నిజమైన నాయకులుగా నిలబడతారని, ఇందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిదర్శనమని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో ఈ దేశ ప్రధానిగానీ, అక్కడి సీఎంగానీ, కేంద్ర మంత్రులుగానీ హైదరాబాద్‌లాంటి అభివృద్ధి మీద మాట్లాడకుండా, జై హనుమాన్, జై బజరంగ్‌బలి అని నినాదాలు చేస్తూ దేవుళ్ల పేరిట రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. విచిత్రమేమిటంటే.. చిన్నప్పటి నుంచి బొట్టు పెట్టుకొనే తనకు కూడా వీళ్లు (బీజేపీ నేతలు) బొట్టు పెట్టుకోవడం నేర్పుతున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ డిక్లరేషన్ పేరిట రాజకీయం చేస్తున్నదని, అధికారంలో 40 సంవత్సరాల పాటు ఉండి ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఆ పొట్టోని నోటికి బట్టనే లేదు.. ఎమ్మెల్యే, మంత్రులు ఎవరూ లేరు.. అందరినీ వాడు, వీడు అని సంభోదిస్తున్నాడు’ అని పీసీసీ అధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌రావు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఎంతో చేశాం.. ఇంకా చేస్తాం
గత తొమ్మిది సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం మనందరం గర్వపడేలా బాగుపడ్డదా? లేదా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘20-25 ఏండ్ల తర్వాత హైదరాబాద్ నగరానికి వచ్చి కొన్ని ప్రాంతాల్లో తిరిగితే ఇది న్యూయార్క్ నగరమా? హైదరాబాద్ నగరమా? అని అనిపించిందని సినీనటుడు రజనీకాంత్ ప్రశంసించారు. అమెరికాలో స్థిరపడి ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చిన సినీ నటి లయ కూడా తాను హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నపుడు లాస్ ఏంజిల్స్, న్యూయార్క్‌లో ఉన్నట్టుగా అనిపించిందని చెప్పారు.
హైదరాబాద్ అంతా మారిపోయింది.. భూతల స్వర్గంగా ఉన్నదని నేను చెప్పడంలేదు. ఇప్పటికే ఎంతో చేశాం.. ఇంకా చేస్తాం’ అని మంత్రి స్పష్టం చేశారు. సామాన్య ప్రజల అవసరాలు తెలుసుకొని మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని నిత్యం సీఎం కేసీఆర్ తమకు చెబుతారని, ఆ మౌలిక వసతులను కల్పించడమే తమకు అలవాటుగా మారిందని పేర్కొన్నారు. నగరంలో రూ.985 కోట్లతో వ్యూహాత్మక నాలా అభివృద్ధి ప్రణాళిక (ఎస్ఎన్డీపీ)ను పూర్తి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టామని, రానున్న నాలుగు నెలల్లో వాటిని పేద ప్రజలకు పంపిణీ చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌ను వందశాతం మురుగు శుద్ధి నగరంగా మార్చేందుకు రూ.3,866 కోట్లతో 31 మురుగునీటి శుద్ధి ప్లాంట్లను కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇవన్నీ విజన్ ఉన్న సీఎం కేసీఆర్ నాయకత్వం వల్లనే సాధ్యమవుతున్నాయని చెప్పారు.