రంగారెడ్డి : పారిశ్రామిక రంగంలో భారతదేశంలోనే తెలంగాణ ( Telangana ) ముందు వరుసలో ఉంది.. వేగంగా దూసుకెళ్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ( KTR )తెలిపారు. 2015 నుంచి ఇప్పటి వరకు టీఎస్ ఐపాస్ ( TS IPASS ) ద్వారా తెలంగాణకు రూ. 2.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు సమీపంలోని మేకగూడలో పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ లిమిటెడ్ కంపెనీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిరతతో కూడిన ప్రభుత్వం ఉన్నందునే పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఈ రెండు సమతుల్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో సమతుల్యమైన అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఐటీ, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యం ఇస్తూనే, ఉపాధి కల్పనలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.
టీఎస్ ఐపాస్ లాంటి విప్లవాత్మక సంస్కరణలు ఎన్నో చేపట్టామని తెలిపారు. టీఎస్ ఐపాస్ లాంటి పాలసీ ఏ రాష్ట్రంలో లేదు. 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. 15 రోజుల్లో అనుమతి రాకపోతే డీమ్డ్ అప్రూవ్డ్గా భావించవచ్చు అని పేర్కొన్నారు. పరిశ్రమలకు నిరాంతరాయంగా నాణ్యమైన కరెంటు, నీళ్లు అందిస్తున్నామని తెలిపారు.
పోకర్ణ కంపెనీలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 3 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈ కంపెనీకి అన్ని విధాలా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కలిసికట్టుగా ముందుకు నడిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన పారిశ్రామిక పాలసీ టీఎస్ ఐపాస్ అద్భుతంగా ఉందని పోకర్ణ లిమిటెడ్ చైర్మన్ గౌతమ్ చంద్ పేర్కొన్నారు. తక్కువ సమయంలో పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. మంత్రి కేటీఆర్ చొరవతో దేశంలోనే అతి పెద్ద మార్బుల్ పరిశ్రమను మేకగూడలో ఏర్పాటు చేశామని తెలిపారు. ప్లాంట్లో సూపర్ జంబో, జంబో స్లాబులను ఉత్పత్తి చేస్తున్నామని గౌతమ్ చంద్ చెప్పారు.
MP Manne Srinivas Reddy, MLAs Anjaiah Yadav, Marri Janardhan Reddy, Danam Nagender, MLC Damodar Reddy, Kasireddy Narayana Reddy, Prl Secy @jayesh_ranjan and other dignitaries graced the occasion.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 31, 2021