మేడ్చల్, జూలై 23 (నమస్తే తెలంగాణ): అధునిక ప్రపంచ భవిష్యత్‌ను రూపుదిద్దడంలో భారతీయ యువతకు ప్రత్యేక సామర్థ్యం ఉన్నదని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా బహుదూర్‌పల్లిలోని మహీంద్రా యూనివర్సిటీలో శనివారం జరిగిన స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 2016-17, 18 విద్యా సంవత్సరాలకు చెందిన ఇంజినీరింగ్ పట్టభద్రులకు కేటీఆర్ సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అద్భుత ఆలోచనా శక్తి, నైపుణ్యాలున్న యువతకు కొదువలేదని పేర్కొన్నారు. దేశ జనాభాలో 65 శాతం యువతే ఉన్నదని గుర్తుచేశారు. 35 ఏండ్ల క్రితం ఇండియా, చైనా ఆర్థిక వ్యవస్థలు సమానంగా ఉండేవని ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ 16 ట్రిలియన్ డాలర్లకు పెరగ్గా, ఇండియా 3 ట్రిలియన్ల డాలర్ల వద్దనే ఉన్నదని చెప్పారు. రాజకీయాలను పక్కనపెట్టి ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చే చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ యువత ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అందిస్తూ ప్రశంసలు అందుకోవటం గర్వకారణమని పేర్కొన్నారు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం గమ్యస్థానంగా మారిందని అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా మహీంద్రా యూనివర్సిటీ ప్రత్యేకతను సాధించుకొన్నదని ప్రశంసించారు. ఇంటర్ డిసిప్లీనరీ విద్య అందించే ఈ యూనివర్సిటీ తెలంగాణలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.
విజ్ఞానం, విలువలు
విజ్ఞాన శాస్త్రంలో మానవీయ విలువలను మిళితం చేసి యువతకు బోధించటమే ఇంటర్ డిసిప్లీనరీ విద్య లక్ష్యమని మహీంద్రా యూనివర్సిటీ చాన్స్‌లర్ అనంద్ మహీంద్రా అన్నారు. ప్రపంచ విద్యా కేంద్రంగా ఎదిగేందుకు భారత్‌కు అన్ని అవకాశాలూ ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులను వారు ఎంచుకొన్న రంగంలో మేధావులుగా గుర్తించి దేశానికి గొప్ప వనరులుగా అందించటమే తమ యూనివర్సిటీ లక్ష్యమని వర్సిటీ చైర్మన్ వినీత్‌నాయర్ తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో గుర్నానీ ప్రశంసించారు. కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్సలర్ యజులు మేదురి తదితరులు పాల్గొన్నారు.