సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 24: అభాగ్యులకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలుస్తున్నారు. ‘సారూ మా కష్టం తీర్చండి.. తలదాచుకొనేందుకు చోటులేక సర్కారు బడిలో ఆశ్రయం పొందుతున్నాం.. డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించి ఆదుకోండి’ అని వేడుకొన్న ఆ తల్లీకొడుకులకు ఇల్లు మంజూరు చేసి అండగా నిలిచారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 26వ వార్డుకు చెందిన అచ్చు ఉమాపతి భార్య శారద కొన్నేండ్ల క్రితం అనారోగ్యంతో మరణించింది. అప్పటి నుంచి తల్లి కమలమ్మతో కలిసి సంజీవయ్యనగర్‌లోని 15 గజాల స్థలంలో గుడిసె వేసుకొని ఉంటున్నాడు. ఉమాపతి ఆరోగ్యం ఇటీవల క్షీణించి మంచానికే పరిమితమయ్యాడు. వరదల సమయంలో గుడిసె కూలిపోవడంతో అదే వార్డులోని ప్రభుత్వ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నెల 15న సంజీవయ్య జయంతి వేడుకలకు హాజరైన సందర్భంలో ఉమాపతితోపాటు ఆయన తల్లి కమలమ్మ కేటీఆర్‌ను కలిసి గూడు కల్పించాలని వేడుకొన్నారు. సమస్య విని చలించిపోయిన కేటీఆర్ వారికి డబుల్ బెడ్రూం మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇల్లు మంజూరైనట్టు అధికారులు గురువారం సమాచారం ఇవ్వడంతో తల్లీకొడుకులు హర్షం వ్యక్తం చేశారు. సంజీవయ్య విగ్రహం వద్ద కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞత చాటుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గూడూరి ప్రవీణ్, బొల్లి రాంమోహన్, మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్ తదితరులు పాల్గొన్నారు.