
హైదరాబాద్/సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ)/మెహిదీపట్నం: ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు మరోసారి తన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలబెట్టుకొన్నారు. రాంగ్రూట్లో వెళ్లిన తన వాహనానికి చలాన్ విధించి, నిబంధనల ప్రకారం నడుచుకొన్న టోలిచౌకి ట్రాఫిక్ ఎస్సై ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును సోమవారం సన్మానించారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా శనివారం లంగర్హౌజ్లోని బాపూఘాట్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా మంత్రి కేటీఆర్కు చెందిన వాహనం రాంగ్రూట్లో వెళ్లింది. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించారు. ఆ సమయంలో మంత్రి కేటీఆర్ ఆ వాహనంలో లేరు.
ఆ తర్వాత ఈ విషయం తెలియడంతో మంత్రి కేటీఆర్ చలాన్ విధించిన ట్రాఫిక్ పోలీసులను సోమవారం అసెంబ్లీలోని తన కార్యాలయానికి పిలిపించుకొని అభినందించారు. చలాన్ మొత్తాన్ని చెల్లించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సామాన్యులైనా, ప్రజాప్రతినిధులైనా నిబంధనలు అందరికీ ఒకటేనని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను ముందుటానని, ఆరోజు వాహనంలో లేనని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు సరైన సందేశం అందించేందుకే ట్రాఫిక్ సిబ్బందిని అభినందించిన విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ అభినందన మాకు బూస్టింగ్
గాంధీ జయంతినాడు ఆ కారు రాంగ్రూట్లో వస్తుండటంతో చలాన్ విధించాం. మంత్రి కేటీఆర్ ఇలా మమ్మల్ని పిలిచి, అభినందించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. మేము మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేసేందుకు మంత్రి ప్రశంసలు బూస్టింగ్ ఇచ్చాయి.
-ట్రాఫిక్ ఎస్సై ఐలయ్య