చీకటి బోర్డు మీద
వెలుగక్షరమైనవారి విరమణకు
ఆక్సిజన్ అందని అంపశయ్య బహుమానం
పిల్లల బతుకు బాటలో
ముళ్లు, రాళ్లు ఏరిన గురువులకు
ఆదుకోని రూపాయితో అవమానం
తరగతి గదిలో జీవించినందుకు
ఇల్లూ వాకిలి కల వాయిదా వాయిదా
విలువల బోధనలో, క్రమశిక్షణ నడవడిలో
గీత దాటనందుకొచ్చిన గుర్తింపు కార్డు
విన్నపాలకు చెల్లడం లేదు
విశ్రాంతి సుఖపడక
అప్పుల రొదతో భగ్నమౌతున్నది
బాంక్ ఖాతా నిల్వలు నిండుకొని,
క్రెడిట్ మెసేజ్ల కోసం కండ్లు వాడి
వత్తులై ఆశగా చూస్తున్నయి
నెలనెలా వేచిచూడని స్థితి నుంచి
ఏండ్లు గడిచినా అతీగతీ ఎందుకు లేదో
ఒక్కొక్క రూపాయి మూటగట్టి, దాసి
ఇప్పుడు ఇమ్మన్నందుకు
న్యాయస్థానం చుట్టూ ప్రదక్షిణల శిక్ష
బడ్జెట్ మళ్లింపుల బాగోతం
కూలోనికి, పింఛనోనికి లింకు లడాయి
సెహభాష్ అనిపించుకోదు
ప్రజాస్వామ్యం సమన్యాయం కోరుకుంటది
కండ్లు తెరవవలసిన వాళ్లు తెరిస్తే
కండ్లు మూసే వాళ్లుండరు
బాధితుల శాపనార్థాలే తప్ప
కృతజ్ఞతలు లేనిది ప్రజాపాలననా
– విరూపాక్ష