శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 02:20:50

సీఎం కేసీఆర్‌ గొప్పనాయకుడు

సీఎం కేసీఆర్‌ గొప్పనాయకుడు

  • దేశ రాజకీయాలు మారాలి
  • ఫెడరల్‌ ఫ్రంట్‌కు అనుబంధంగా.. 
  • కల్చరల్‌ ఫ్రంట్‌ పెడితే కలిసి నడుస్తా 
  • సంతోషంగా రాష్ట్ర రైతులు, ప్రజలు
  • ప్రజా గాయకుడు గద్దర్‌ వ్యాఖ్య
  • మంత్రి కొప్పులతో సమావేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గొప్ప ప్రజా నాయకుడని, పాలనాదక్షుడని ప్రజా గాయకుడు గద్దర్‌ కొనియాడారు. దేశ రాజకీయాల గతిని సమూలంగా మార్చాల్సిన అవసరమున్నదని, ఇందుకోసం ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు సిద్ధమైన కేసీఆర్‌.. దానికి అనుబంధంగా కల్చరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుచేస్తే సంపూర్ణంగా మద్దతు ఇస్తానని ప్రకటించారు. గురువారం గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటాపురం డివిజన్‌ ఇంచార్జి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌.. గద్దర్‌ను ఆయన నివాసంలో కలిశారు.  

ఈ సందర్భంగా గద్దర్‌తో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రాష్ట్ర సాధనకు 14 రోజుల పాటు కఠోర దీక్ష చేసిన సందర్భాన్ని గుర్తు చేశారు. గొప్ప నాయకుడైన కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ పెడితే దానికి అనుబంధంగా కల్చరల్‌ఫ్రంట్‌ ఏర్పాటుచేసి ఆయనతో ముందుకు సాగాలనేది తన అభిమతమని గద్దర్‌ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటి ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో సస్యశ్యామలంగా మారిందని, రైతులు, ప్రజలు సంతోషిస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌గా పోటీచేస్తున్న సబితా కిషోర్‌ను గద్దర్‌ ఆశీర్వదించారు.