సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 30: ‘అంతా మా ఇష్టం.. ఇష్టముంటే ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి’ అంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాశంగా మారాయి. కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవం, జాతర ఏర్పాట్లపై సిద్దిపేట పట్టణ శివారులోని హరిత మినర్వా హోటల్లో శనివారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారిక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, కొందరు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేగా ఓడిపోయిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి హాజరయ్యారు. దీనికి పల్లా అభ్యంతరం తెలుపడంతో.. మంత్రి సురేఖ, ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకున్నది. ప్రత్యేకంగా కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని ఆహ్వానించడంపై వివాదం మొదలైనది.
ఇది కాంగ్రెస్ పార్టీ సమావేశం కాదని, ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలుచుకుంటే స్టేజీ మీద ఉండకూడదని ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి అనడంతో.. ‘ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచే హక్కు నాకు ఉంది.. మీకు ఇష్టముంటే ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి’ అని మంత్రి కొండా సురేఖ బదులిచ్చారు. దీంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేతోపాటు మరికొందరు జడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా సమావేశం నుంచి బయటకొచ్చారు. అనంతరం పల్లా మీడియాతో మాట్లాడుతూ.. కొమురవెల్లి జాతర ఏర్పాట్ల సమీక్షలో కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం విడ్డూరమని పేర్కొన్నారు. మల్లన్న సన్నిధిలో నిర్వహించాల్సిన సమావేశాలను జాతర ఆచారాలు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా.. గత 30 ఏండ్లలో ఏనాడూ హోటళ్లలో పెట్టలేదని గుర్తు చేశారు. ఓడిపోయిన నాయకులను తీసుకొచ్చి సమావేశంలో కూర్చోబెట్టడం దురదృష్టమని తెలిపారు. ఇలాంటి చర్యలను ఖండిస్తూ తాము సమావేశాన్ని బహిష్కరించామని వివరించారు.