హైదరాబాద్, మార్చి 28(నమస్తే తెలంగాణ): శ్రీరామనవమి పర్వదినాన ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ వివిధ పత్రికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన (అడ్వైర్టెజ్‌మెంట్)ల్లో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫొటో గల్లంతైంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించిన సీతారామ కల్యాణ మహోత్సవానికి ఆహ్వానం తెలుపడంతోపాటు ఆలయ అభివృద్ధి, గోదావరి పుష్కర ఘాట్ల నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేస్తారని ఆ ప్రకటనలో ప్రభుత్వం పే ర్కొన్నది.
ఆ ప్రకటనలో కనీసం ఆమె పేరు కూడా ఎక్కడా లేకపోవడం గమనార్హం. కేవ లం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫొటోలతోనే ఆ ప్రకటన జారీచేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఫొటో లేకుం డా కార్యక్రమ ప్రకటన జారీచేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై ఇటు కాంగ్రెస్‌లో అటు అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఇది కచ్చితంగా దేవాదాయ శాఖ మంత్రిని అవమానించడమేననే అభిప్రాయాలను వ్యక్తమవుతున్నాయి. ఇది తనను అవమానించడమేనంటూ కొండా సురేఖ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలిసింది.
ప్రభుత్వం ఇచ్చిన యాడ్‌లో మంత్రి కొండా సురేఖ ఫొటో లేకుండా చేయడంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హస్తం ఉన్నదనే చర్చ కొండా సురేఖ అనుచర వర్గంలో జరుగుతున్నది. తన ఫొటో వేస్తే మంత్రి కొండా సురేఖ ఫొటో కూడా వేయాల్సి వస్తుందనే ఆలోచనతో పొంగులేటి తన ఫొటో కూడా వద్దన్నట్టుగా తెలిసింది. ఇప్పటికే మంత్రి పొంగులేటికి, మంత్రి కొండా సురేఖ నడుమ నెలకొన్న వైరం బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి ఇలా చేశారనే చర్చ జరుగుతున్నది.