Minister Konda Surekha |హైదరాబాద్, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ): ‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా తయారైంది మంత్రి కొండా సురేఖ తీరు. బుధవారం సినీ నటుడు నాగార్జున కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగిన విషయం తెలిసిందే. అవి సద్దుమణగక ముందే మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేశారు. తన వ్యాఖ్యలపై ఇంటాబయట విమర్శలు రావడంతో దిగొచ్చిన ఆమె గురువారం ఉదయం సంజాయిషీ ఇచ్చుకొని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
కేటీఆర్‌పై మాట్లాడుతూ భావోద్వేగానికి లోనై అనుకోకుండా ఓ కుటుంబంపై నోరుజారినట్టు తెలిపారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత కోపం, ద్వేషం లేదని పేర్కొన్నారు. తన వ్యాఖ్యల తర్వాత అక్కినేని కుటుంబం ట్వీట్ చూసి తాను కూడా బాధపడినట్టు చెప్పారు. ఏ విషయంలో అయితే తాను బాధపడ్డానో అదే విషయంలో ఇంకొకరిని నొప్పించానని భావించి ఆ వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకున్నట్టు పేర్కొన్నారు.
ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ సంజాయిషీ ఇచ్చి గంటలు కూడా పూర్తి కాకముందే సాయంత్రం మళ్లీ నాగచైతన్య, సమంతల విడాకులపై పిచ్చి ప్రేలాపనలు చేశారు. నాగచైతన్య, సమంత ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయం ప్రపంచానికి తెలియదని, వారి కుటుంబం నుంచి కూడా దీనిపై ఏమీ చెప్పలేదని పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సమాచారంతో తాను ఆ వ్యాఖ్యలు చేసినట్టు చెప్పారు. ‘కోపం వచ్చింది. కోపంలో మాట్లాడాల్సి వచ్చింది.. మాట్లాడిన’ అని చెప్పడం గమనార్హం. ఆమె మరోసారి ఈ వ్యాఖ్యలు చేయడంపై ప్రజల నుంచి రెట్టింపు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఓ మంత్రా అంటూ తిట్టిపోస్తున్నారు. మతి భ్రమించి మాట్లాడుతున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.