హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): సీనియారిటీ ప్రకారం కొందరు ఆంధ్రా అధికారులకు కొన్ని పదవులు ఇచ్చామని, నాడు ఆంధ్ర అధికారులు వద్దని మేము తిట్టినా.. నేడు పదవులు ఇచ్చాం కాబట్టి హర్షించాలని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశం అనంతరం మీడియా పాయింట్ వద్దకు వచ్చిన మంత్రిని.. ‘నాడు ఆంధ్రా అధికారుల పెత్తనం వద్దని డిమాండ్ చేసిన మీరు.. ఇప్పుడెలా ఆంధ్రా అధికారులకు పదవులు కట్టబెట్టారు?’ అని ప్రశ్నించగా.. తమ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆంధ్రా అధికారులకు పదవులు దక్కడంపై రాజకీయం చేయడం సరైంది కాదని అన్నారు. ఎక్కడైనా సీనియారిటీని బట్టి అధికారులకు ఆయా పదవులు దక్కుతాయని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆంధ్రా అధికారులను అందలం ఎక్కించారని మరోసారు వితండ వాదం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో ఉన్న ఆంధ్రా అధికారులను రేవంత్‌రెడ్డి తిట్టడం సబబేనని చెప్పారు. ఇప్పుడు ఆయనొక ముఖ్యమంత్రిగా సీనియారిటీ బట్టి ఆంధ్రా అధికారులకు పదవులు ఇచ్చారని, మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు హర్షించాలని చెప్పారు. నాడు తిట్టినా.. నేడు వారికే పదవులు ఇచ్చారంటే మంచి ఆఫీసర్లు, సిన్సియారిటీ ఉన్నోళ్లని గుర్తించాలని తెలిపారు. టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డిని నియమించడం పట్ల నిరుద్యోగుల్లో అసహనం పెరుగుతుందని ప్రస్తావించగా.. అట్లాం టి భయం అవసరం లేదని చెప్పారు. ఏ ఒక్క నిరుద్యోగికి కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్యాయం జరగదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టో అమలు చేసే దిశగా వెళ్తుందని, తమ గురించి మాట్లా డే నైతిక హక్కు ఎమ్మెల్సీ కవితకు లేదని మండిపడ్డారు.