హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఫారెస్ట్ అధికారులకు కూడా పోలీసులతో సమానంగా ప్రయోజనాలు అందేందుకు కృషి చేస్తానని అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని బహదూర్‌పురలోని నెహ్రూ జూ పారులో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండాసురేఖ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, రాష్ట్ర అటవీదళాల ప్రధానాధికారి డాక్టర్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ… అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి వీరమరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలు వృథా కానివ్వరాదని అన్నారు. 1984 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 22 మంది తమ ప్రాణాలు కోల్పోవడం బాధకరమని అన్నారు. అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, సీసీఎఫ్లు ప్రియాంక వర్గీస్, రామలింగం, జూపార్క్ డైరెక్టర్ సునీల్ హీరామత్, క్యూరేటర్ వసంత ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.