కరీమాబాద్, డిసెంబర్ 16 : కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిల్లరగాళ్ల గురించి మాట్లాడనని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె గ్రేటర్ వరంగల్ 41వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో అదే డివిజన్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కార్పొరేటర్ గుండేటి నరేందర్ కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో తేనేటి విందుకు హాజరయ్యారు. ఈ విషయమై మంత్రిని మీడియా ప్రశ్నించగా.. ‘పార్టీలో కొందరు చిల్లరగాళ్లు ఉన్నారు.. వారి గురించి మాట్లాడను, మంత్రి హోదాలో వారిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసే స్థాయి కాదు, కొండా దంపతులను ఎదుర్కొనే దమ్ము లేక వెనుకాల గోతులు తీస్తున్నారు, ఆ గోతుల్లో వారే పడతారు, కొండా దంపతులను ఢీ కొట్టే స్థాయి స్వపక్షంలో గానీ, విపక్షంలో గానీ ఎవరికీ లేదు’ అని మంత్రి పేర్కొన్నారు.
కొంతకాలంగా కొండా దంపతులు.. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైనా.. కొండా దంపతుల వర్గం, ఎమ్మెల్సీ బస్వరాజు వర్గాలుగా చేపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మంత్రి సురేఖ పర్యటన, అదే డివిజన్లో ఎమ్మెల్సీ సారయ్య తేనేటి విందు అంశం చర్చనీయాంశంగా మారింది. మంత్రి పార్టీ నాయకులపై చిల్లరగాళ్లంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.