హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం తారస్థాయికి చేరింది. ఇప్పటికే రేవంత్ సర్కార్‌పై సొంత పార్టీ నేతలే బహిరంగ విమర్శలు చేస్తూ రచ్చకీడుస్తుంటే, తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ముఖ్యమంత్రిపైనే అవినీతి ఆరోపణలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు, క్రమశిక్షణ చర్యల కోసం నోటీసులు.. వివరణల పరంపర కొనసాగుతున్న సమయంలో హఠాత్తుగా మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తాజా వివాదం ఒకటి తెరపైకి వచ్చింది.
ఎప్పుడో 20రోజుల క్రితం సుమంత్‌కు ఓ వ్యక్తితో జరిగిన గొడవను తాజా రాజకీయాలకనుగుణంగా మార్చుకున్నట్టు స్పష్టమవుతున్నది. అప్పుడు పట్టించుకోని పోలీసులు, ఫిర్యాదు చేయని బాధితుడు.. సరిగ్గా ‘రేవంత్.. నీ అవినీతి గుట్టు రట్టు చేస్తా!’ అని పరకాలలో సుస్మిత అల్టిమేటం ఇచ్చిన మరునాడే సుమంత్‌పై హత్యాయత్నం కేసు నమోదు కావడం గమనార్హం. అంటే ‘ముఖ్య’నేతకు నచ్చితే చుట్టం, లేకపోతే చట్టం!’ అనేలా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతున్నది. ‘ప్రభుత్వ పెద్ద’లకు నచ్చితే ఎన్ని అరాచకాలు చేసినా చట్టం కండ్లప్పగించి చూస్తుంది. ప్రభుత్వం బారాఖూన్ మాఫ్ అంటుంది. కానీ ముఖ్యనేతకు నచ్చకపోతే మాత్రం చట్టానికి రెక్కలొస్తాయి. పాత ఘటనలను బయటకు తీసి కేసులు నమోదవుతాయి.
రేవంత్ సర్కార్ ప్రయోగించిన ఈ చట్టానికి ఇప్పటిదాకా మీడియా, సోషల్ మీడియా, ప్రతిపక్షాలు బాధితులుగా ఉండగా, ఇప్పుడు ఆ జాబితాలోకి సొంత పార్టీ నేతలు చేరారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అనగానే సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాన అనుచరుడు రోహిన్‌రెడ్డి, డెక్కన్ సిమెంట్స్ యజమానితో సెటిల్మెంట్ వ్యవహారం, సదరు యజమాని కణతకు సుమంత్ తుపాకీ గురిపెట్టడం, ఆపై మినిస్టర్ క్వార్టర్స్‌లో సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేసిన హంగామా.. ఈ క్రమంలో మంత్రి కుమార్తె సుస్మితా పటేల్ సీఎం రేవంత్, ఆయన సోదరులపై సంచలన ఆరోపణలు చేయడం గుర్తుకు వస్తుంది. అదే సుమంత్‌పై తాజాగా మరో వివాదం తెరపైకొచ్చింది.
బాధితుడి కథనం ప్రకారం.. బోడుప్పల్ సమీపంలోని ఆర్టీసీకాలనీ పార్క్ విల్లాస్‌లో నివాసముంటున్న గొంగిడి హరికృష్ణ(36)కు గత నెల 30న మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఫోన్ చేశాడు. అత్యవసరంగా మాట్లాడేది ఉన్నదని, రావాలని కోరాడు. మరునాడు హరికృష్ణకు స్నేహితుడు రాము ఫోన్ చేసి, ఆఫీస్‌కు రావాలని పిలిచాడు. దీంతో గత నెల 31న రాత్రి 9.45 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలోని రాము ఆఫీస్‌కు హరికృష్ణ వెళ్లాడు.
సుమంత్ అప్పటికే అక్కడ ఉన్నాడు. తమ పేరుతో డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నావని వారిద్దరూ హరికృష్ణను బెదిరించారు. దాదాపు రూ.10 కోట్ల మేర వసూలు చేశావంటూ కొన్ని ఉదాహరణలు కూడా చెప్పినట్టు సమాచారం. సుమంత్ ఇనుప రాడ్‌తో హరికృష్ణ చేతులు, కాళ్లపై తీవ్రంగా కొట్టినట్టు సమాచారం. ఈ దాడిలో హరికృష్ణ ఎడమ చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. అరుపులు, గొడవలు విన్న స్థానికులు డయల్ 100కు ఫోన్ చేయడంతో జూబ్లీహిల్స్ స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకున్నారు. బాధితుడు హరికృష్ణను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే.. తాను చికిత్స తీసుకున్న తర్వాత ఫిర్యాదు చేస్తానని పోలీసులకు చెప్పి హరికృష్ణ అక్కడినుంచి వెళ్లిపోయాడు.
ఘటన జరిగిన 20 రోజుల తర్వాత గురువారం తెల్లవారుజామున రెండు గంటలకు హరికృష్ణ మేడిపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జూలై 31న జరిగిన ఘటనపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు సుమంత్‌తోపాటు ఇతర వ్యక్తులపై బీఎన్ఎస్ 109 రెడ్ విత్ 3(5) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కేసును జూబ్లీహిల్స్ పీఎస్‌కు బదిలీ చేశారు. అయితే.. ఘటన జరిగిన 20 రోజుల తర్వాత బాధితుడు ఎందుకు ఫిర్యాదు చేశాడనేది ఇప్పు డు చర్చనీయాంశమైంది. సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న కిరణ్ అనే వ్యక్తి సుమంత్‌కు, హరికృష్ణకు స్నేహితుడని తెలిసింది.
తాను హరికృష్ణపై దాడి చేశానని సుమంత్ స్వయంగా కిరణ్‌కు చెప్పగా, రోజుల వ్యవధిలో అది సీఎం రేవంత్‌రెడ్డి చెవిన పడినట్టు ప్రచారం జరుగుతున్నది. అప్పుడు ఆయన అంత సీరియస్‌గా తీసుకోలేదని, బుధవారం సు స్మిత ఆరోపణల తర్వాత ఆ అంశాన్ని వెలికి తీశారని చెప్తున్నారు. హరికృష్ణ తన పేరిట డబ్బులు వసూ లు చేస్తున్నారని పోలీసులకు సుమంత్ ఫిర్యాదు చేయగా, జనరల్ డైరీలో నమోదు చేసి, చేతులు దులుపుకొన్నారనే ప్రచారం జరుగుతున్నది.