హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మృతిపట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) సంతాపం తెలిపారు. ఆయన నిరాడంబరత, మృధు స్వభావం, సేవాభావం ఎన్నటికీ మరువలేదని చెప్పారు. నెల రోజులుగా మృత్యువుతో పోరాడిన జిట్టా మరణం తనను కలచివేసిందన్నారు. కొద్ది రోజుల క్రితం దవాఖానలో కలిసి ధైర్యం చెప్పానని తెలిపారు. ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదని చెప్పారు. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధకరమన్నారు.
తెలంగాణ ఉద్యమంలో బాలకృష్ణా రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పారు. ఆయనతో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబం ఈ తీవ్ర మనోవేదన నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి ధైర్యం ఇస్తూ అండగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు.
బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న జిట్టా బాలకృష్ణారెడ్డి.. గత కొంతకాలంగా సికింద్రాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు భువనగిరికి తరలించారు. సాయంత్రం 4 గంటలకు పట్టణ శివార్లలోని మగ్గంపల్లి రోడ్డులో ఉన్న తమ ఫామ్‌హౌస్‌లో అంతక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు.