 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్రంలో 334ప్రాంతాల్లో 230 కిలోమీటర్లమేర రోడ్లకు నష్టం వాటిల్లిందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. దెబ్బతిన్న, కోతకు గురైన రోడ్లు, వంతెనలు, కాజ్‌వేల తాత్కాలిక మరమ్మతులకు రూ.7 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.225 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. భారీ వర్షాలతో రాష్ట్రంలో జరిగిన నష్టంపై గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కోమటిరెడ్డి మాట్లాడుతూ రోడ్లకు జరిగిన నష్టాన్ని వివరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఐకేపీ సెంటర్లలో ఉన్నాయని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలుచేసి, వెంటనే మిల్లులకు తరలించేలా చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. మంత్రుల నివాస సముదాయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కోమటిరెడ్డితోపాటు సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు అధికారుల ను ఆదేశించారు. గురువారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని కలెక్టర్లు, వాటర్‌బోర్డు, ఆర్అండ్బీ, విద్యుత్తు అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో ఫోన్లో స మీక్షించారు. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని, విద్యుత్తు సరఫరాకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూ చించారు. నష్టాన్ని అంచనా వేసి నివేదికలు పంపించాలని కోరారు. రాకపోకలు నిలిచిపోయిన గ్రామాల రోడ్ల మరమ్మతులు చేపట్టి, రవాణాను పునరుద్ధరించాలని తెలిపారు.
హనుమకొండ, అక్టోబర్ 30: మొంథా తుపాను కారణంగా ఎన్పీడీసీఎల్ పరిధిలో జరిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో విద్యుత్తుశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. విద్యుత్తు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో భారీ వర్షంలోనూ సరఫరాను పునరుద్ధరించినట్టు సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో తుఫాన్ ప్రభావంతో 428 స్తంభాలు, సబ్ మెర్జ్డ్ డీటీఆర్లు 218 దెబ్బతినగా, ఎనిమిది 33/11 కేవీ సబ్ స్టేషన్లు నీటమునిగాయి. వీటిలో 88 స్తంభాలు, 78 సబ్ మెర్జ్డ్ డీటీఆర్లను సరిచేయగా, ఆరు నీటమునిగిన సబ్ స్టేషన్లకు చార్జింగ్ చేసినట్టు తెలిపారు. హనుమకొండ, వరంగల్ సర్కిల్, మహబూబాబాద్, కరీంనగర్ సర్కిళ్ల పరిధిలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్నదని, సరఫరాను పునరుద్ధరించిన సిబ్బందికి సీఎండీ అభినందనలు తెలిపారు.
 
                            