ట్రిపుల్ఆర్ అయ్యేదా పొయ్యేదా? అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. అలాంటప్పుడు వేలాదిమంది రైతుల భూములను లాక్కునే రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్కు ఏకంగా క్యాబినెట్ ఆమోదం తెలిపిందీ అబద్ధమేనా? నిరాటంకంగా భూసేకరణ కొనసాగిస్తున్నదీ మిథ్యేనా? లేక రైతులను మాయ చేసేందుకు కోమటిరెడ్డి నడిపిస్తున్న డ్రామానా?
‘ఒకడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు. వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నామనుకో, అన్నంలో పప్పు కలుపుకొని తింటాడు. పప్పు లాక్కున్నామనుకో చారు కలుపుకొని తింటాడు. అన్నమే లాక్కున్నామనుకో, వాడు కంగారుపడి అటూ ఇటూ చూస్తాడు. అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి. అప్పుడు వాడు ఎగిరి గంతేసి చికెన్ బిర్యానీని మరిచిపోయి మన దగ్గర బానిసలా పడుంటాడు. సమాధానాలు ఎవరికి కావాలయ్యా… అది మన పాలసీ!’
ప్రజల్ని ఎలా మభ్య పెట్టాలో ఓ సినిమాలో రాజకీయ నేత చెప్పే డైలాగ్ ఇది. ప్రస్తుతం రీజినల్ రింగు రోడ్డు మీద కాంగ్రెస్ తీరు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పాలసీ ఇట్లనే కనిపిస్తున్నది. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇదే ట్రిపుల్ ఆర్ బాధిత రైతులను భూములియ్యకండి! చూసుకుందాం! అని రెచ్చగొట్టారు. అధికారంలోకి వచ్చి రింగు రోడ్డు మంత్రి కాగానే అదే రైతులకు ముఖం చాటేస్తున్నారు. రైతులు తిప్పలు పడి కలుసుకుంటే ‘రింగు రోడ్డు అయ్యేది లేదు, పొయ్యేదీ లేదు’ అన్నరంటే మంత్రి చెప్తున్నట్టు రీజినల్ రింగు రోడ్డు పట్టాలెక్కదా? అదే నిజమైతే ఇదే మంత్రి ఆధ్వర్యంలో ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్కు మంత్రివర్గం ఎందుకు ఆమోదం తెలిపినట్టు? ఇదే కోమటిరెడ్డి ఎక్కిన విమానం, దిగిన విమానం అన్నట్లు కేంద్ర మంత్రి గడ్కరీకి పదేపదే వినతిపత్రాలు ఎందుకు ఇస్తున్నట్టు? ఇక్కడే అసలు పితలాటకం దాగి ఉన్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరం చుట్టూ రీజినల్ రింగు రోడ్డు ఏర్పాటులో భాగంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఉత్తర, దక్షిణ భాగాల అలైన్మెంట్ను రూపొందించారు. ఉత్తర భాగం అలైన్మెంట్కు కేంద్ర సర్కారు అనుమతి కూడా వచ్చింది. దక్షిణ భాగం అలైన్మెంట్ రూపకల్పన పూర్తయిందిగానీ అప్పటికే అసెంబ్లీ ఎన్నికలు రావడం ఆపై వచ్చిన కాంగ్రెస్ సర్కారు దానిని అష్ట వంకరలు తిప్పడం తెలిసిందే. ప్రధానంగా కాంగ్రెస్ పెద్దల భూములను కాపాడేందుకు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ను మార్చి సన్న, చిన్నకారు రైతుల భూముల్లో నుంచి తీసుకుపోయారు. ఈ వాస్తవాల్ని ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టడంతో అనేక జిల్లాల్లో పెద్ద ఎత్తున రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. కడుపు మండిన రైతన్నలు రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ హయాంలో అసలు ట్రిపుల్ ఆర్కు భూములే ఇవ్వొద్దని రైతుల్ని రెచ్చగొట్టిన మం త్రి కోమటిరెడ్డి చాలా రోజులుగా రింగు రోడ్డు బాధిత రైతులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఆయన ఏదైనా కార్యక్రమానికి వచ్చినపుడు కలుద్దామంటే ఆయన కంటేముం దుగానే పోలీసులు వచ్చి రైతులను పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. దీంతో ఎట్టకేలకు కొంద రు మంత్రి కోమటిరెడ్డిని పట్టుకొని ‘రింగు రోడ్డు’ గోడును ఆయన ముందుంచారు.
తాతల నాటి నుంచి ఆస్తిగా వచ్చిన కోట్ల రూపాయల భూముల్ని రక్షించుకోవాలనే ఆందోళనతో రైతులు ఎట్లనో కష్టపడి ఆయన ముందుకుపోయినా మంత్రి మాత్రం అసలు ప్రాజెక్టు గురించి మాట్లాడం లేదు. దాని గురించి మాట్లాడాలంటే తొలుత తాను ఎంపీగా ఉన్నపుడు రింగు రోడ్డుకు భూములు ఎందుకు ఇవ్వొద్దన్నారో సమాధానం చెప్పాలి. అంతకుమించి, గత అలైన్మెంట్ను ఎందుకు మార్చారో వివరణ ఇచ్చుకోవాలి. అందుకే రింగు రోడ్డు చర్చ లేకుండా చేస్తే సరిపోతది కదా అని ఎత్తుగడ వేశారు. తమకు జీవన్మరణ సమస్యగా మారిన ఈ విషయాన్ని రైతులు మంత్రి ముందు ఉంచితే ‘రింగు రోడ్డు అయ్యేదా? పొయ్యేదా?’ అని ఒక్క ముక్కలో కొట్టిపారేశారు. దీంతో రైతులు అలైన్మెంట్, భూసేకరణ ఇవన్నీ మర్చిపోతారు.
అసలు రింగు రోడ్డు ప్రాజెక్టునే ముందల పడదంట! సాక్షాత్తూ రింగు రోడ్డు మంత్రే చెప్పాడని ఊర్లో డప్పు చాటించినట్టు ఇతర రైతులకు కూడా చెప్తారు. ఇగ కానిదానికి, పోనిదానికి మనమెందుకు ఇండ్లు, పనులు వదిలిపెట్టుకొని రోడ్ల మీద పడాలని రైతులు తమకు తాము సర్ది చెప్పుకుంటారు. ఆందోళనలు విరమించుకొని రింగు రోడ్డు అలైన్మెంట్ ఊసే ఎత్తరు. కానీ అధికారులు మాత్రం ట్రిపుల్ ఆర్ మీద వాహనాలు పరుగులు పెట్టినట్టు కాగితాలపై భూసేకరణ ప్రక్రియను ఉరకలు వేయిస్తారు. రాత్రికి రాత్రి భూసేకరణ నోటిఫికేషన్లు ఇచ్చి రెవెన్యూ రికార్డుల్లో నుంచి రైతుల పేర్లు పోయి రింగు రోడ్డు ఎక్కుతుంది. దీంతో ఫార్మా సిటీ బాధిత రైతుల లెక్క ఈ రైతులు ఎన్ని దీక్షలు చేసినా, ఎన్ని ఆందోళన చేపట్టినా సర్కారు ఆమోదించిన అలైన్మెంట్ ప్రకారం రింగు రోడ్డు పట్టాలెక్కుతుందనేది బహిరంగ రహస్యం.
ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చినపుడు కాలయాపనతో దానిని తొక్కి పెట్టడమనేది కాంగ్రెస్కు వెన్నతో పెట్టిన విద్య అని సీనియర్ పాత్రికేయులు చెప్తారు. ఇదే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ను నిరుడు మార్చిన సమయంలోనే ‘నమస్తే తెలంగాణ’ ప్రభుత్వ పెద్దల కమాల్పై వరుస కథనాలు ప్రచురించింది. రైతుల్లో నిరసనలు మొదలయ్యే క్రమంలోనే కాంగ్రెస్ ప్ర భుత్వం ఒక మంత్రివర్గ సమావేశంలో దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు కోసం ఒక కమిటీని వేసింది. దీంతో రైతులందరూ అలైన్మెం ట్ ఇంకా కాలేదు కదా అని మిన్నకున్నారు. కొంతకాలం తర్వాత అకస్మాత్తుగా మరో మంత్రివర్గ సమావేశంలో అలైన్మెంట్ను ఆమోదించేశారు. చాలాకాలం తర్వాతగానీ మార్చిన అలైన్మెంట్ వివరాలు, మ్యాపు బయటికి రాలేదు. ఇప్పుడు రైతులు ఆందోళనలకు దిగుతుండటంతో మరోసారి వారిని మభ్యపెట్టేందుకు కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని రైతులే విశ్లేషిస్తున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ప్రజల్లో రోడ్లు, భవనాల శాఖకు మంచి పేరు తీసుకువచ్చే బాధ్యత శాఖ ఇంజినీర్లపైనే ఉన్నదని, ఆ గురుతర బాధ్యతను గుర్తెరిగి ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. మరింత ఉత్సాహంతో పనిచేస్తారనే ఉద్దేశంతోనే ఆర్అండ్బీ శాఖలో సమూలమార్పులు తీసుకొచ్చి, కోరినవన్నీ ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పారు. మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ శాఖ బలోపేతంపై దృష్టి పెట్టి అదే స్థాయిలో పనిచేసేందుకు కృషిచేయాలని సూచించారు. ఆర్అండ్బీ ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు గురువారం మంత్రి కోమటిరెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి 118 మంది ఏఈఈలకు డీఈలుగా, 72మంది డీఈలకు ఈఈలుగా, 29 మంది ఈఈలకు ఎస్ఈలుగా, ఆరుగురికి సీఈలుగా, ఇద్దరికి ఈఎన్సీలుగా ప్రమోషన్ కల్పించినట్టు వివరంచారు. ఇతర క్యాడర్లలో మిగిలిన ప్రమోషన్లను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పూర్తి పారదర్శకతో ఏ శాఖలో లేని విధంగా రోడ్లు భవనాలు శాఖలో ప్రమోషన్స్ ఇచ్చామని చెప్పారు. మంత్రిని కలసిన వారిలో ఆర్అండ్బీ ఇంజినీర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఎన్ శ్రీను, జనరల్ సెక్రటరీ బీ రాంబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పీ శరత్చంద్ర తదితరులు ఉన్నారు.