నల్లగొండ : ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యను అందించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komati Reddy Venkata Reddy )అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట (Badi bata) కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందువల్ల తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలందరినీ బడికి పంపించాలని కోరారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయడం ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు రూ.600 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదని, విద్యార్థులు పెద్ద లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని చదవాలన్నారు. త్వరలోనే 13,000 కొత్త టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు మంత్రి విద్యార్థుల చేత సామూహిక అక్షరాభ్యాసం చేయించారు.