హైదరాబాద్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ) : రీజినల్ రింగు రోడ్డు(ట్రిపుల్ ఆర్)నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు మంచి ధరలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రైతులు అధైర్యపడకుండా భూసేకరణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్అండ్బీ శాఖ పరిధిలో వివిధ ప్రాజెక్టుల పురోగతిపై సోమవారం సచివాలయంలో మంత్రి అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి కావాల్సిన 1,941.65 హెక్టార్ల భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయినట్టు చెప్పారు. రోడ్డు నిర్మాణంలో ప్రభావితమవుతున్న అటవీభూములకు ప్రత్యామ్నాయంగా మహబూబాబాద్ జిల్లాలో 73.04 హెక్టార్ల భూమిని అటవీశాఖకు కేటాయించినట్టు తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణంలో వేగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎన్హెచ్-65ని 6 లేన్లుగా విస్తరించేందుకు డీపీఆర్ రూపకల్పనకు ఇప్పటికే టెండర్లు పిలిచినట్టు, త్వరలోనే కన్సల్టెంట్ను నియమించనున్నట్టు వెల్లడించారు. నాగ్పూర్-విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయినందున అపాయింటెడ్ డేట్ వచ్చేలోగా పెండింగ్ భూసేకరణ పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందనతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.