హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఏపీ సాంస్కృతిక విభాగం, ఒడిశా సాంస్కృతిక శాఖల సౌజన్యంతో ఈ నెల 25, 26 తేదీల్లో కళాకృతి నృత్యాలయ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యాదాద్రి జాతీయ నృత్యోత్సవాల వాల్‌పోస్టర్‌ను మంగళవారం రవీంద్రభారతిలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతీయ కళలు, సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కళలు, కళారూపాలను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. యాదాద్రి డ్యాన్స్ ఫెస్టివల్ చైర్మన్ బీఆర్ విక్రమ్‌కుమార్, డైరెక్టర్ భారతి మాట్లాడుతూ.. భరతనాట్య దిగ్గజం, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత గీతాచంద్రన్కు యాదాద్రి జాతీయ ఎక్స్‌లెన్స్ అవార్డును ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్‌లో నాట్యాంజలి పోటీలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.