హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : కలిసికట్టుగా డ్రగ్స్ మహమ్మారిని అడ్డుకుందామని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. గురువారం రవీంద్ర భారతిలో పీఎన్ఎం ఆధ్వర్యంలో ‘డ్రగ్స్‌ని నిర్మూలిద్దాం-సమాజాన్ని మేలుకొలుపుదాం’ పేరుతో చేపట్టిన కళాయాత్రను మంత్రి ప్రారంభించారు.
ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 21 వరకు హైదరాబాద్‌తోపాటు నగర శివారులోని హైసూల్స్, జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ కాలేజీల్లో కళాప్రదర్శనతో డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మత్తుపదార్థాలను అరికట్టేందుకు యువత, విద్యార్థులు యాంటీ డ్రగ్స్ కమిటీల్లో చేరి సైనికులుగా పనిచేస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి ఆహ్వానసంఘం సలహాదారు నర్సింహారావు, కార్యదర్శి మారన్న పాల్గొన్నారు.