తెలంగాణలో కొత్త లిక్కర్ బ్రాండ్ల అనుమతి వ్యవహారం రేవంత్ సర్కారులో చిచ్చుకు కారణమవుతున్నదా? అసలు కొత్త బ్రాండ్లను తెస్తున్న సంగతి ఎక్సైజ్ మంత్రి, సీనియర్ నాయకుడైన జూపల్లి కృష్ణారావుకు తెల్వనే తెల్వదా? ఆయనను డార్క్‌లో ఉంచి వేరే ‘వ్యక్తో-శక్తో’ అసలు కథ నడిపించారా?
కొత్త మద్యం బ్రాండ్ల వ్యవహారంతో తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందని మంత్రి జూపల్లి ఆవేదన చెందుతున్నారా? మంత్రినైన తనను బైపాస్ చేసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బద్నాం చేశారని భావిస్తున్నారా? మంగళవారం ఎక్సైజ్ శాఖపై మంత్రి కృష్ణారావు 4 గంటల సుదీర్ఘ సమీక్ష జరిపిన తర్వాత విడుదలైన ప్రెస్‌నోట్ చూస్తే ఈ అనుమానాలే కలుగుతున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ‘కొత్త మద్యం కంపెనీలకు అనుమతులెట్లా వచ్చినయ్? పర్మిషన్ ఇచ్చిందెవరు? వారికి అండగా ఉన్నదెవరు? నా శాఖలో నాకు తెల్వకుండా ఇదంతా ఎట్లా జరిగింది? నా క్రెడిబిలిటీ అంతా గంగపాలైంది. దీనికంతటికి ఎవరు కారణమో ముందు తేల్చండి. తక్షణమే సమగ్ర విచారణ జరిపి, నివేదికివ్వండి’ అంటూ ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమీక్ష సమావేశంలో అధికారులపై జూపల్లి ఆగ్రహం వ్యక్తంచేయడంతోపాటు.. మీడియాకు విడుదల చేసిన ప్రకటనలోనూ అనుమతులను ప్రభావితం చేసింది ఎవరో తేల్చాలని ఆదేశించినట్టు స్పష్టంగా పేర్కొన్నారు. ఏకంగా మంత్రే ఇలా మాట్లాడటంతో కొత్త కంపెనీల రాక వెనుక, వాటి అనుమతులు వెనుక చక్రం తిప్పిన బయటివ్యక్తులు ఎవరనే చర్చ మొదలైంది.
తెలంగాణ ప్రభుత్వం సోమ్ డిస్టలరీకి అనుమతిలిచ్చిందంటూ నమస్తే తెలంగాణ గత నెలలో కథనాన్ని ప్రచురించింది. దీనిపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి స్పందించి.. అనుమతులేవీ ఇవ్వలేదని తొలుత చెప్పారు. కానీ, కొద్దిరోజులకే సోమ్ డిస్టలరీతోపాటు కొత్తగా ఐదు మద్యం కంపెనీలకు అనుమతులిచ్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. హంటర్, బీర్యాని, బ్లాక్‌బస్టర్ వంటి బీర్ల బ్రాండ్ల ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అవాక్కయిన మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశం పెట్టి మరీ.. అనుమతుల సంగతి తనకు తెలియదని, పర్మిషన్లు ఇచ్చేది బేవరేజెస్ కార్పొరేషన్ అని సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. తన శాఖలో తనకు తెలియకుండా జరుగుతున్న పరిణామాలతో ఆగ్రహంగా ఉన్న ఆయన మంగళవారం ఎక్సైజ్ అధికారులతో సమావేశమయ్యారు. నాంపల్లిలోని ఆబ్కారీభవన్కు ఉదయం 11 గంటలకు వచ్చిన మంత్రి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్, ఎండీ, బేవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్, ఉమ్మడి జిల్లాల డిఫ్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఇటీవల ఎక్సైజ్ శాఖలో చోటు చేసుకున్న పరిణామాలపై, తనను బైపాస్ చేస్తూ తీసుకున్న పలు నిర్ణయాలపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్త మద్యం కంపెనీల రాక వెనుక ఉన్న వ్యక్తులు, శక్తులు ఎవరనే దానిపై సంజాయిషీ ఇవ్వాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఈ అనుమతుల వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి సమగ్ర నివేదికను తనకు సమర్పించాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్, ఎండీ శ్రీధర్, బేవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహంను ఆదేశించారు. నివేదికను బట్టి తక్షణమే చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. తన విశ్వసనీయతను దెబ్బతీస్తే ఎవరైనా సరే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.
ఏ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకున్నారు?
తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి, ఎక్సైజ్ శాఖకు చెడ్డపేరు వస్తున్నదని.. కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు. అధికారుల సొంత నిర్ణయాల వల్ల ఎక్సైజ్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని, దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రిగా తన విశ్వసనీయత కూడా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. కొత్త మద్యం కంపెనీల అనుమతుల వ్యవహరంలో తన దృష్టికి తీసుకురాకుండా బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు ఎలా విధివిధానాలు ఖరారు చేశారని మండిపడ్డారు. అసలు ఏ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని అధికారులను ఆయన నిలదీశారు.
పబ్బులకూ అనుమతులపై మంత్రి ఆగ్రహం
మద్యం కంపెనీలకే కాకుండా పబ్బులకు, మద్యం దుకాణానికి అనుమతులు ఇవ్వడంపైనా మంత్రి జూపల్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నాకు తెలియకుండానే హైదరాబాద్‌లో రెండు ప్లబ్బులకు అనుమతి ఎట్లా ఇచ్చారు? ఎవరిచ్చారు? నిబంధనలు లేకపోయినా ఓ మద్యం దుకాణానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఎవరు చెప్తే చేస్తున్నారు? అంటే నేను డమ్మీనా? మంత్రిగా నాకేమీ విలువలేదా?’ అంటూ జూపల్లి ఓ దశలో అధికారులపై మండిపడ్డారని సమాచారం. తనకు తెలియకుండా జరుగుతున్న వాటి వెనుక ఉన్న వారెవరో తెలియాలంటూ.. అధికారులనుంచి సమాచారం రాబట్టేందుకు ఆయన పలు విధాలుగా ప్రయత్నించినట్టు తెలిసింది. కొత్త మద్యం బ్రాండ్ల అనుమతులనేవి పెద్ద వ్యవహారమని, పెద్దస్థాయి వ్యక్తులే అధికారుల నిర్ణయాలను ప్రభావితం చేసి ఉంటారని తెలుస్తున్నది. అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేసినట్టుగానే బయటకు కనిపిస్తున్నప్పటికీ.. తన శాఖలో తనను బైపాస్ చేసి వేరెవరో నిర్ణయాలు తీసుకోవడం ఆయన ఆక్రోశానికి కారణమైనట్టు కనిపిస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు.
సమన్వయంతో పనిచేయండి
డ్రగ్స్, అక్రమ మద్యం సరఫరా, కల్తీకల్లు, గుడుంబా, గంజాయి సరఫరా, అమ్మకాలపై నిరంతర నిఘా పెట్టాలని మంత్రి జూపల్లి అధికారులను ఆదేశించారు. యాంటీ నారోటిక్ బ్యూరో, పోలీసు శాఖ సమన్వయంతో ఎక్సైజ్‌శాఖ అధికారులు పని చేయాలని సూచించారు. తయారీదారులు, సరఫరాదారులు, విక్రేతలు, సప్లయర్ నెట్వర్ జాబితా తయారు చేసి డాటా బేస్ తయారు చేయాలని దిశానిర్దేశం చేశారు. తరచుగా ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై ఉకుపాదం మోపాలన్నారు. ఉద్యోగులు, సిబ్బంది సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని సూచించారు.