సూర్యాపేట : సూర్యాపేటను పచ్చదనంతో కూడిన ఆరోగ్యవంతమైన పట్టణంగా మారుస్తామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. మహిళల ఆరోగ్య భద్రతకే రుతు ప్రేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఆదివారం నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బెంగళూరుకు చెందిన పర్యావరణవేత్త డాక్టర్ శాంతి ఆధ్వర్యంలో రుతుప్రేమపై మహిళలకు అవగాహన సదస్సు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
మహిళలంతా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో రుతుప్రేమ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
సూర్యాపేట మహిళలు స్వచ్ఛ సూర్యాపేట కోసం చేపట్టిన పవిత్రమైన యజ్ఞానంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మహిళలు రుతుస్రావ సమయంలో రసాయనిక ప్యాడ్స్ వాడటం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని, దీని కోసమే డాక్టర్ శాంతి ద్వారా జిల్లాలో రుతు ప్రేమ అవగాహన సదస్సులు జరిపి మహిళలందరూ ప్యాడ్స్ బదులుగా కప్స్ వాడే విధంగా జిల్లా యంత్రాంగం సహాయంతో మహిళలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు.
సదస్సుకు హాజరైన మహిళలు
ఈరోజు సూర్యాపేటలోని మహిళా ప్రజా ప్రతినిధులు, వార్డు కౌన్సిలర్లకు అలాగే సూర్యాపేట పట్టణంలోని మహిళా డాక్టర్లను కూడా ఈ అవగాహన సదస్సుకు పిలిచినట్లు మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలుపరుస్తూ అన్ని వర్గాల ప్రజలకు ఆసరాగా ఉంటుందని మంత్రి అన్నారు. ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పల్లె దవఖానాలు, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారని చెప్పారు.
అలాగే ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పరిచి మహిళల కోసం ప్రత్యేకంగా ప్రతి మంగళవారం ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సీహెచ్ ప్రియాంక, జెడ్పీ చైర్ పర్సన్ దీపికా యుగంధర్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ అన్నపూర్ణ శ్రీనివాస్, పెన్పాడు జడ్పీటీసీ మామిడి అనిత, చివ్వెంల ఎంపీపీ కుమారి, జడ్పీటీసీ జీడి భిక్షం,డీడబ్ల్యూవో జ్యోతి పద్మ, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ శారద, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.