సూర్యాపేట : వరంగల్లో.. ప్రధాని మోదీ ప్రసంగంపై మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. సూర్యాపేట లో మీడియా తో మాట్లాడిన మంత్రి.. ప్రధాని హోదాలో ఉన్న మోదీ.. స్థాయిని తగ్గించుకొని అబద్ధాలు చెప్పారని విమర్శించారు. మరోసారి తెలంగాణ మీద, సీఎం కేసీఆర్ మీద మోదీ తన అక్కసు వెళ్లగక్కారన్నారు. అవినీతిలో బిజెపి కాంగ్రెస్ ని మించి పోయిందని ఎద్దేవా చేశారు.
మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో జరిగిన అవినీతే బిజెపి పాలనకు సాక్ష్యం అని అన్నారు. తమ బండారం ఎక్కడ బయటపడుతుంది అనే భయంతోనే కేసీఆర్ కుటుంబంపై మోదీ అవాకులు, చెవాకులు పేలుతున్నారు. రాఫెల్ కుంబకోణం, బ్యాంకులకు లక్షల కోట్లు టోకరాపెట్టిన బడా బాబులే నీ కుటుంబ సభ్యులు అని ఆరోపించారు.
కొద్దిమంది కోసం దేశాన్ని తాకట్టు పెట్టిన ఘనుడు ప్రధాని మోదీ అని విమర్శించారు. చైతన్యవంతమైన వరంగల్ , తెలంగాణ ప్రజానీకం మోదీ అబద్ధాలు నమ్మరని చెప్పారు. కేంద్రం సహా బిజెపి పాలిత రాష్ట్రాల కంటే అన్ని రంగాల్లోనూ తెలంగాణ ముందంజలో ఉందన్నారు. దీని కారణంగా నే తెలంగాణ పై ముఖ్యమంత్రి కేసీఆర్ పై అబద్ధపు ప్రచారానికి మోదీ శ్రీకారం చుట్టరాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే.. దేశం నాశనానికి కారకులు ఈ ఇద్దరే అని ఘాటుగా విమర్శించారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి.. ప్రభుత్వాలను కూల్చడమే బిజెపి సర్కార్ పని అన్నారు. తెలంగాణ లో.. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రజల మనసులో స్థానం లేదన్నారు. బిజెపి దుర్మార్గపు పాలనకు త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చరమగీతం పాడబోతున్నారని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.