భువనగిరి,యాదాద్రి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత స్వరాష్ట్రం అభివృద్ధిలో అధికారుల పాత్ర మరువలేనిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy ) అన్నారు. తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. శనివారం భువనగిరి,యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సుపరిపాలనా(Good Governance) దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంత్రి మాట్లాడుతూ ప్రజలు, అధికారులు కలిసి సాధించిన ఫలితాలను ఉత్సవాలుగా నెమరువేసుకోవడం, కలిసి సంబురాలు చేసుకోవడం ఎక్కడా ఉండదని, ఒక్క తెలంగాణలోనే సాధ్యమైందని ఆయన చెప్పారు. నూతన జిల్లాల(New Districts) ఏర్పాటులో ఎక్కువగా లాభపడింది యాదాద్రి భువనగిరి జిల్లా అని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంటునే ప్రస్తుతం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్స్, గర్భిణులకు ఆర్ధిక సహాయం తదితర సంక్షేమ పథకాలను అందిస్తున్న కేసీఆర్ ను తలచుకుని సంబరపడుతున్నారని అన్నారు
46 లక్షల మందికి వివిధ రకాల పెన్షన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. దివ్యాంగులకు మరో వెయ్యి రూపాయల పెన్షన్ పెంచి వారికి మనో ధైర్యం కల్పించారని అన్నారు. పరిశ్రమల దినోత్సవం రోజున మంత్రి కేటీఆర్(Minister KTR) జిల్లాకు వచ్చి 51 పరిశ్రమలను ప్రారంభించారని తెలిపారు. ఏ రంగం చూసినా మన రాష్ట్రమే ముందుందని, అవార్డులు ఇస్తే దేశంలో ప్రతి సంవత్సరం రాష్ట్రమే 80 శాతం అవార్డులు దక్కించుకొంటుందని వివరించారు.
తెలంగాణలో అమలవుతున్న పథకాలు గుజరాత్లో కూడా లేవు
తెలంగాణలో అమలవుతున్న పథకాలు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)సొంతరాష్ట్రం గుజరాత్లో కూడా లేవని మంత్రి అన్నారు. కేసీఆర్ పరిపాలన అర్ధం కావాలంటే ప్రక్క రాష్ట్రాలకు వెళ్లి చూడాలని అన్నారు. మహారాష్ట్ర(Maharastra), గుజరాత్, మధ్యప్రదేశ్(Madya Pradesh) రాష్ట్రాలలో ఒక్క పూట అన్నం మాత్రమే తింటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గత తొమ్మిదేళ్లుగా ఎన్నో విజయాలు సాధించామని అన్నారు. సంపద పెంచు పేద ప్రజలకు పంచు అనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన సుపరిపాలన ద్వారా సాధ్యమవుతున్నదని చెప్పారు.
భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, తుంగతుర్తి శాసన సభ్యులు గాదరి కిశోర్, జిల్లా కలెక్టరు పమేలా సత్పతి మాట్లాడారు. మీసేవ ద్వారా సుపరిపాలన సేవలు అందించిన మీ సేవ నిర్వాహకులకు మంత్రి జగదీష్ రెడ్డి ప్రశంసా పత్రాలను అందచేశారు. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, టీస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బిక్కూనాయక్, మున్సిపల్ చైర్మన్లు ఆంజనేయులు, వెన్ రాజు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అమరేందర్ గౌడ్, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.