హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, పాజిటివ్ నిర్ధారణ అయిందని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నానని మంత్రి తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకుని జాగ్రత్తలు పాటించాలని మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. సోమవారం కొత్తగా 1,825 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 3.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గింది. మరోవైపు 351 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా, ఇతర కారణాలతో ఒకరు మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 15వేలకు చేరుకొన్నది. రికవరీ రేటు కాస్త తగ్గి 97.26 శాతంగా నమోదైంది.
అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,042, మేడ్చల్ మల్కాజిగిరి 201, రంగారెడ్డి 147, సంగారెడ్డి 51, హనుమకొండలో 47 కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్క కేసు కూడా నమోదుకాని ములుగు జిల్లాలో 2 కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సోమవారం కేసులు నమోదయ్యాయి. అటు.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 2.74 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో 1.13 లక్షల మందికి మొదటిడోస్, 1.39 లక్షల మందికి రెండో డోస్, 22,045 మందికి బూస్టర్ డోస్ వేశారు. 15-18 ఏండ్లు మధ్య వయసు వారికి ఇప్పటి వరకు 7.52 లక్షల మదికి టీకాలు వేశారు.