రాష్ట్రంలో పెరిగిన డిమాండ్‌కు అవసరమైన విద్యుత్తు అందుబాటులో ఉన్నదని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 6,600 మెగావాట్లుగా ఉన్న విద్యుత్తు సరఫరా డిమాండ్ గత మే నాటికి 13,686 మెగావాట్లకు పెరిగిందని చెప్పారు.రాష్ట్రంలో మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 16,613 మెగావాట్లుగా ఉన్నదని వివరించారు. సోమవారం శాసనమండలిలో ఎమ్మెల్సీలు తేరా చిన్నప్పరెడ్డి, జీవన్‌రెడ్డి, జాఫ్రీ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 2020-21లో మొత్తం 56,111 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగించినట్టు చెప్పారు.
ఇందులో గృహ, వాణిజ్య అవసరాలకు 17,935 మిలియన్ యూనిట్లు, పరిశ్రమలు, వ్యవసాయ, లిఫ్ట్‌ల నిర్వహణకు 38,176 మిలియన్ల యూనిట్లు వినియోగమైందని పేర్కొన్నారు. 2020-21 నాటికి టీఎస్ డిస్కమ్‌ల ఆదాయం రూ.30,330 కోట్లు ఉండగా, ఆగస్టు 31 నాటికి రూ.13,865 కోట్లు వచ్చిందని వివరించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తాత్కాలిక టారిఫ్‌తో యూనిట్ రూ.3.90 పైసలకు కొంటామన్నారు.